ఈదేశంలో ఎన్ని ఉత్పాతాలు సంభవించినప్పటికీ రాజకీయాలు మాత్రం ఆగవు. ఉత్తర భారతంలో వడగాడ్పుల ధాటికి తట్టుకోలేక అనేక మంది పిట్టల్లా నేల రాలిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభాగ్య జీవులకు స్థలం చాలడం లేదు…
ఈదేశంలో ఎన్ని ఉత్పాతాలు సంభవించినప్పటికీ రాజకీయాలు మాత్రం ఆగవు. ఉత్తర భారతంలో వడగాడ్పుల ధాటికి తట్టుకోలేక అనేక మంది పిట్టల్లా నేల రాలిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభాగ్య జీవులకు స్థలం చాలడం లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్ లోని బలియాలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం 68 మంది మరణించారు. ఆసుపత్రుల్లో కూడా కరెంట్ లేకపోవడంతో వృద్ధులు అక్కడికక్కడే విగత జీవులవుతున్నారు. ఉత్తర భారతావని అంతటా పాఠశాలల వేసవి సెలవులను పొడిగించారు. ప్రతి ఏడాదీ ఈ వేడి గాలులకు లోనై వేలాది మంది మరణించటం సాధారణమైపోయింది. అయినా కేంద్రం , రాష్ట్రాలలోని డబుల్ ఇంజన్ సర్కార్ల కలిసికట్టుగా కార్యాచరణకు పూనుకోవడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చర్యలు తీసుకుంటాయి. ఇంతటి చిన్న సమస్యనే పరిష్కరించలేని వారు మణిపూర్ లాంటి అతి తీవ్ర సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు?
గత 50 రోజులుగా మణిపూర్ నెత్తుటి ధారలతో మండిపోతున్నది. 150మందికి పైగా ప్రజలను హతమార్చారు. ఈ హింసాకాండ మూమూలుది కాదు. ఒళ్లు జలదరింప చేసే హింసాకాండ. తలలో బుల్లెట్ తగిలిన ఒక బాలుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకుపోతుంటే ఒక అల్లరి మూక దానిని అడ్డుకుని దగ్ధం చేసింది. అందులో ఆ బాలుడితో పాటు అతడి తల్లి, బంధువు బూడిదయ్యారు. ఒక గ్రామాన్ని పూర్తిగా దగ్థం చేసి అనేకమందిని మంటలకు ఆహుతి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులంతా పలాయనం చిత్తగించి పర్వత ప్రాంతాల్లో దాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వేలాది ప్రజలు శిబిరాల్లో తలదాచుకున్నారు. 60 వేల మంది తమ ఇళ్లను విడిచి పారిపోయారు. 4300 విధ్వంస ఘటనలు సంభవించాయి. వీటిలో భాగంగా 3500 ఇళ్లు, 275 గ్రామాలు ధ్వంసం అయ్యాయి. మణిపూర్‌లో ఇప్పుడు పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అంటూ ఎవరూ లేరు. ఉన్నదల్లా రెండు వర్గాలే. ఆ రెండు వర్గాలు ఒక దాన్ని మరొకటి నిర్మూలించుకునే పరిస్థితిలో ఉన్నాయి. మణిపూర్‌లో ఎల్లెడలా సైన్యం విస్తరించినా, హింసాత్మక మూకలు అత్యాధునిక ఆయుధాలతో ఊచకోతలు చేస్తున్నాయి. వారి చేతుల్లోకి ఈ ఆయుధాలు ఎలా వచ్చాయి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపూర్‌కు వెళ్లి నాలుగు రోజులు బస చేసివచ్చారు. అయినా హింస ఆగ లేదు. సుప్రీంకోర్టు కూడా శాంతి భద్రతల పరిస్థితి తమ చేతుల్లో లేదని నిస్సహాయత ప్రకటించింది.
పైపెచ్చు మణిపూర్‌లో ఆరు సంవత్సరాలుగా బిజెపి నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారే కొనసాగుతోంది. మరి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమి చేసినట్లు? లిబియా, లెబనాన్, నైజీరియా, సిరియా లాంటి దేశాల్లో కనపడే ఇలాంటి బీభత్స బర్బర హింసాకాండ మన దేశంలోని ఒక రాష్ట్రంలో నెలరోజులకు పైగా జరుగుతున్నా మోదీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతోంది? ప్రజలను శాంతింపచేసి తమ మాట వినేలా ఎందుకు చేయలేకపోతోంది? అసలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నా కేంద్రం దాన్ని రద్దు చేసి పరిస్థితిని తన చేతుల్లోకి ఎందుకు తీసుకోవడంలేదు?
మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య చారిత్రకంగా ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నప్పటికీ ఎందుకు కేంద్ర, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండలేదు? హింసాకాండ గురించి వారికి ఎందుకు ముందస్తు సమాచారం అందలేదు? ఆదీవాసీలను అక్రమంగా వారి ప్రాంతాల నుంచి తొలగించడం, మెయిటీల రిజర్వేషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించడం మొదలైన వాటి పర్యవసానాలను మోదీ సర్కార్ ముందుగా ఊహించలేదా? ఆదివాసీలంతా ఏకమై ఒక మోర్చాను ఏర్పర్చి ర్యాలీ తీసిన విషయమై వారికి సమాచారం లేదా? లేక మెజారిటీ ప్రజాప్రతినిధులు ఒకే వర్గానికి చెందిన వారున్నందువల్ల తమ రాజకీయాలకోసం మౌనం పాటించారా? లేక దేశంలో ఇతర రాజకీయాలు చేస్తూ మణిపూర్‌ను విస్మరించారా?
విచిత్రమేమంటే మణిపూర్‌ను అమిత్ షా సందర్శించిన తర్వాతే ఆ ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండ మరింత తీవ్రతరమైంది. ఆయనకు అనేక బాధ్యతలు. దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని అరికట్టడం అనేది ఆయనకు అందులో ఒక బాధ్యత మాత్రమే. దేశంలో రాజకీయాలు చేయడం, భారతీయ జనతా పార్టీని వివిధ రాష్ట్రాల్లో గెలిపించడం. ప్రతిపక్ష నేతలను బలహీనపరచడం మొదలైన అనేక బాధ్యతలు ఉన్నాయి. మణిపూర్‌లో హింసాకాండ జరుగుతున్న సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. కర్ణాటకలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత ముఖ్యమో చెబుతూ వీథీ వీథీ వారు తిరిగారు. ఆ ఎన్నికల ఘట్టం పూర్తయిన తర్వాత కాని అమిత్ షా మణిపూర్ సందర్శించలేదు.
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ అయితే మణిపూర్ గురించి ఇంతవరకూ పెదవి విప్పనేలేదు. కనీసం శాంతియుతంగా ఉండాలని ప్రజలకు పిలుపు కూడా ఇవ్వడం లేదు. దమన కాండ, దారుణాలు జరిగినప్పుడు మౌనంగా ఉండడం, అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉపన్యాసాలు చేయడం ఆయన నైజంగా కనపడుతుంది. గుజరాత్‌తో పాటు తన హయాంలో ఎక్కడ అల్లర్లు జరిగినా ఆయన మాట్లాడలేదు. మహిళా మల్లయోధులు తమపై లైంగిక అత్యాచారాలు జరిగాయని రెండు నెలలుగా ఘోషిస్తున్నా ఆయన స్పందించలేదు. ఇలాంటి ఘటనలపై ఆయన ‘మన్ కీ బాత్’ మనకు వినపడదు. గత ఆదివారం తన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో మణిపూర్ గురించి ప్రస్తావించనందుకు అక్కడి ప్రజలు ఆగ్రహోదగ్రులై రేడియోలను విధ్వంసం చేశారు. ‘మణిపూర్ కీ బాత్’ వినాలని వారు డిమాండ్ చేశారు.
మణిపూర్ తగులబడుతుండగానే ప్రధానమంత్రి తన అమెరికా పర్యటనకు బయలుదేరిపోయారు. వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికలున్న రీత్యా మోదీకి అమెరికా మద్దతు ఎంతో అవసరం. ఎప్పటి మాదిరే ప్రవాస భారతీయులు మోదీకి ఘనస్వాగతం చెప్పేందుకు తగిన సన్నాహాలు జరిగాయి. అమెరికా విదేశాంగ ప్రయోజనాలను కాపాడడంతో పాటు అక్కడి పారిశ్రామికవేత్తలు, సిఇఓలను ఆయన ఎంత సంతృప్తిపరుస్తారన్న అంశంపైనే ఆయన పర్యటన విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది.
ఈశాన్య భారత రాష్ట్రాల గురించి సాధారణంగా జాతీయ మీడియాలో చర్చ జరగదు. అక్కడ ప్రజల ఈతి బాధలగురించి ఎవరూ పెద్దగా ప్రస్తావించరు. ఈశాన్యాన్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చామని బిజెపి చెప్పిన కబుర్లు ఎంత బూటకమైనవో మణిపూర్ హింసాకాండను బట్టి అర్థం చేసుకోవచ్చు. మణిపూర్‌లో హింసాకాండ పెచ్చరిల్లిన తర్వాతే ఆ రాష్ట్రం గురించి దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసింది. దేశంలో అన్ని సమస్యలూ మెజారిటీ వాదం ద్వారా పరిష్కారం కావు. మెజారిటీ వర్గాల రాజకీయాన్ని మణిపూర్‌లో అవలంబించాలనుకుంటే భీకర దుష్పరిణామాలు ఉంటాయి. దేశంలో వివిధ వర్గాలను రాజకీయాలకు ఉపయోగించుకున్నట్లే, కుకీలు, మెయిటీలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని పబ్బం గడుపుకోవాలని బిజెపి నేతలు ప్రయత్నించినందుకే ఈ సమస్య తీవ్రతరమైంది.
నిజానికి ఇంతటి భీకరసమస్య వచ్చినప్పుడు ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. కనీసం హోంశాఖకు చెందిన స్థాయీ సంఘానికి ఈ పరిస్థితిని నివేదించాలి, కాని ప్రభుత్వానికి అలాంటి స్పృహే ఉన్నట్లు లేదు. మణిపూర్‌లో విచ్ఛిన్నకర రాజకీయాలు మానుకోవాలని, ప్రధానమంత్రి తన మౌనం వీడాలని దాదాపు 550 పౌర సమాజ బృందాలు, ప్రజా ప్రతినిధులు, రచయితలు సంయుక్త ప్రకటన చేశారు. ఆదివాసీలు తమ నివాసాలకు సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘బలమైన రాజకీయ మనోస్థైర్యం ఉంటే కాని మణిపూర్ సమస్యకు పరిష్కారం లభించదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ఈ అంశంపై మాట్లాడి పరిష్కారం సూచించాలి’ అని ప్రముఖ రంగ స్థల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత రతన్ థియామ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి నియమించిన శాంతి కమిటీలో ఉండేందుకు ఆయన నిరాకరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా వెళ్లిన రోజే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చారు. మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే దేశంలో అనేక రాజకీయ పరిణామాలు ఉంటాయని, కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు వివిధ రాజకీయ శక్తుల పునరేకీరణ జరుగుతుందని అంటున్నారు. అమెరికా పర్యటన ఇచ్చిన ఆత్మస్థైర్యంతో మోదీ తీసుకునే విస్తృత చర్యలే బిజెపి రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయనడంలో సందేహం లేదు. మరోవైపు రాహుల్ గాంధీ రాకతో కూడా కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు ప్రారంభం కానున్నాయి. పలువురు నేతల చేరికతో పాటు ప్రతిపక్ష నేతల సమావేశాలు ముమ్మరం కానున్నాయి. జూన్ 23న పాట్నాలో జనతాదళ్(యు) నేత నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం దేశంలో బలమైన ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనుంది. రానున్న ఎన్నికలు దేశంలో రెండు కూటములకు జీవన్మరణ సమస్య అనడంలో సందేహం లేదు. కాని ఈ భీకర రాజకీయ పోరులో మణిపూర్ లాంటి ప్రాంతాల్లో దిక్కుతోచని అభాగ్య జీవుల గోడును వినేదెవరు? పరిష్కరించేదెవరు?