Ambati Rayudu: ‘పాపం.! విజయ్ శంకర్ ఏం చేశాడు.. నా కోపమంతా అక్కడే వచ్చింది’..అంబటి రాయుడు. తెలుగు ముద్దుబిడ్డ. అజారుద్దీన్, వీవీఎస్లక్ష్మణ్ తర్వాత అంతటి టాలెంట్ ఉన్న తెలుగు క్రికెటర్. కాని క్రికెట్ పాలిటిక్స్‌లో నలిగిపోయాడు.అంబటి రాయుడు. తెలుగు ముద్దుబిడ్డ. అజారుద్దీన్, వీవీఎస్లక్ష్మణ్ తర్వాత అంతటి టాలెంట్ ఉన్న తెలుగు క్రికెటర్. కాని క్రికెట్ పాలిటిక్స్‌లో నలిగిపోయాడు. అదీ ఒకరోజు రెండు రోజులు కాదు.. తొలి రోజు నుంచి చివరి అంతర్జాతీయ మ్యాచ్ వరకు అదే పరిస్థితి. టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన రాయుడు.. తన మనసులోన మాటలను బయటపెట్టాడు. ఎన్నడూ ఎవరితో చెప్పని సంగతులను పంచుకున్నాడు. అసలు రాయుడు ఏమన్నాడు?
అంబటి రాయుడు కామెంట్స్ మాత్రమే కాదు. తన మనసులోని ఆవేదన కూడా ఇదే. టీమ్ సెలక్షన్లో కాని.. ఆట విషయంలోనూ కాని.. రాయుడిని తొక్కేందుకు ఎన్నో శక్తులు పనిచేశాయి. అంబటి రాయుడు పేరు చెప్పగానే.. వెంటనే గుర్తొచ్చేది 2019 వరల్డ్ కప్ సెలక్షన్ వివాదం. తనను వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకపోవడంపై అంబటి రాయుడు తొలిసారి పెదవి విప్పాడు. 2019 వరల్డ్ కప్ కోసం తాను నాలుగేళ్ల ముందు నుంచే సన్నద్ధం అయ్యానని రాయుడు చెప్పాడు. 2018లో బీసీసీఐ నుంచి వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ కావాలనే సంకేతాలు అందాయని చెప్పాడు. కానీ 2019 వరల్డ్ కప్‌కి ముందే.. తనను ఎంపిక చేయరనే సంకేతాలు కనిపించాయని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ సమయంలో విమానం దిగి ఫోన్ స్విచ్ఛాన్ చేయగానే.. వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేదని తెలిసిందని తెలిపాడు. దీంతో తాను నిరాశ చెందానన్నాడు. నాలుగో స్థానం కోసం తనను ఎంపిక చేయాలని అనుకున్నారని.. ఆ స్థానానికి సరిపడే రహానే లాంటి మరో బ్యాటర్‌ను తీసుకుంటే పర్వాలేదు కానీ.. ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యపరిచిందన్నాడు. నాలుగో స్థానంలో ఎక్స్పీరియన్స్ బ్యాటర్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ను తీసుకోవడమే కోపం తెప్పించందని.. విజయ్ శంకర్‌పై ఎలాంటి శత్రుత్వం లేదని.. అతడు తనకు మంచి మిత్రుడని రాయుడు అన్నాడు.
అంబటి రాయుణ్ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేయకపోవడానికి కారణం అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. జట్టు ఎంపిక అనేది ఒక్కరి వల్లే కాదన్నాడు రాయుడు. మేనేజ్మెంట్లోని కొందరి వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్నాడు. బీసీసీఐ మేనేజ్మెంట్లో హైదరాబాద్‌కి చెందని ఒకాయన ఉన్నాడని పరోక్షంగా శివలాల్ యాదవ్‌పై రాయుడు ఆరోపణలు గుప్పించాడు. చిన్నప్పుడు జరిగిన పరిస్థితుల వల్ల.. గతంలో ఆంధ్రాకు ఆడటానికి వెళ్లాను. అప్పుడు ఆంధ్రా జట్టుకు ఎమ్మెస్కే కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు ఆయన చేసిన పనులు నాకు నచ్చలేదు. దీంతో మళ్లీ హైదరాబాద్‌కే వచ్చాను. ఆయన ఆలోచనా విధానం.. ఆటను చూసే తీరు.. పనులు అప్పట్లో నాకు నచ్చలేదని రాయుడు చెప్పాడు. నన్ను వరల్డ్ కప్‌కి ఎందుకు ఎంపిక చేయలేదో ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాలని రాయుడు అభిప్రాయపడ్డాడు.హెచ్‌సీఏలో తన చిన్నప్పటి నుంచే రాజకీయాలు మొదలయ్యాయన్న రాయుడు.. శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ను ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాకు ఆడించాలనేది వాళ్ల అభిలాష అని తెలిపాడు. కానీ అందుకు తాను అడ్డుగా ఉంటాననే భావనతో.. తన అడ్డు తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారన్నాడు. అప్పటికీ తన వయసు 17 ఏళ్లు మాత్రమేనని రాయుడు తెలిపాడు. హెచ్‌సీఏలో నా చిన్నతనంలోనే క్యాన్సర్ మొదలైంది. ఇప్పుడది నాలుగో స్టేజ్‌కు వచ్చింది. బీసీసీఐ జోక్యం చేసుకుంటేనే పరిస్థితి మారుతుందని రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘2003-04లో ఇండియా-ఏ తరఫున బాగా ఆడాను కానీ 2004లో సెలక్షన్ కమిటీ మారిందని… శివలాల్ యాదవ్ సన్నిహితులు ప్యానెల్లోకి వచ్చారన్నాడు. అప్పటి నుంచి తనకు బ్రేక్ పడిందని ఎందుకు ఎంపిక చేయలేదని అడగటం కూడా తప్పు అయ్యిందన్నాడు. నాలుగేళ్లపాటు ఎవర్నీ తనతో మాట్లాడనీయకుండా చేశారన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు శివలాల్ యాదవ్ తమ్ముడు తాగి వచ్చి ఇంటి ముందు బూతులు తిట్టేవాడని.. తనను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారన్నాడు. తాను గ్రౌండ్లో మాత్రమే దూకుడుగా ఉన్నానని చెప్పిన రాయుడు.. డ్రెస్సింగ్ రూంలో ఎప్పుడూ అలా ఉండలేదన్నాడు.