ప్రపంచంలోని అత్యంత విలువైన 500 బ్రాండ్లలో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే కంపెనీ బ్రాండ్ విలువ 15 శాతం (5,100 కోట్ల డాలర్ల మేర) క్షీణించినప్పటికీ ద్వితీయ స్థానం నుంచి ప్రథమ స్థానానికి ఎగబాకింది
Brand Finance Report: ముఖేష్ అంబానీ వల్ల కాలేదు. గౌతమ్ ఆదానికి సాధ్యం కాలేదు. ఇంకా పేరుపొందిన వ్యాపారవేత్తలు వెనుకంజ లోనే ఉన్నారు. వీరి వల్ల కానిది.. టాటా గ్రూప్ సాధించింది. భారతదేశంలో అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్ గా టాటా గ్రూప్ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఏడాదికి గానూ బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన నివేదికలో తిరుగులేని విధంగా ఆ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 2022 తో పోలిస్తే టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 10.3% వృద్ధితో 2,638 కోట్ల డాలర్లకు అంటే సుమారు 2.18 లక్షల కోట్లకు పెరిగింది. 2,500 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఏకైక భారత బ్రాండ్ కూడా ఇదే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత విలువైన 100 బ్రాండ్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక గ్రూప్ (69వ స్థానం) కూడా ఇదే కావడం విశేషం.
విశ్వసనీయతకు పెద్దపీట
టాటా గ్రూప్ చాలా వ్యాపారాల్లో ఉంది. ఇనుము నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఎగుమతుల వరకు అన్నింటిలోనూ టాటా గ్రూప్ ది పై చేయి. టాటా సన్స్ గ్రూపులో సుమారు రెండు లక్షలకు దగ్గరగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర దేశాల్లో కూడా ఈ గ్రూపుకు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలతో పాటు సామాజిక సేవ చేయడం టాటా గ్రూప్ కు మొదటి నుంచి ఉన్నదే. పైగా ఉత్పత్తుల తయారీలో నాణ్యతను పాటించడం టాటా గ్రూపును అంతకంతకు గొప్ప సంస్థగా మలిచింది. 100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో సుమారు 30 శాతం మంది టాటా ఉత్పత్తులను ఏదో ఒక రూపంలో వాడుతారంటే అతిశయోక్తి కాదు. అందుకే టాటా గ్రూప్ నెంబర్ వన్ కార్పొరేట్ బ్రాండ్ గా ఎదిగింది.
మిగతా కంపెనీలో విషయానికి వస్తే
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా (1,301 కోట్ల డాలర్లు) మరోసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఎల్ఐసీ సైతం మూడో స్థానాన్ని తిరిగి దక్కించుకోగలిగింది. సంస్థ బ్రాండ్ విలువ 975.6 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఎయిర్టెల్ (752.7 కోట్ల డాలర్లు) నాలుగో స్థానానికి ఎగబాకగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ (735.7 కోట్ల డాలర్లు) ఐదో స్థానానికి జారుకుంది. ఎస్బీఐ 6, మహీంద్రా గ్రూప్ 7, విప్రో 8, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 9, హెచ్‌సీఎల్ టెక్ 10వ స్థానంలో నిలిచాయి. మహీంద్రా గ్రూప్.. టాప్ టెన్‌లో విలువ అత్యంత వే గంగా వృద్ధి చెందిన బ్రాండ్ గా పేరుపొందింది. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ బ్రాండ్లలో ఒకటిగా మహీం ద్రా ఆటో నిలిచింది. గ్లోబల్ జాబితాలో టెక్ మహీంద్రా ర్యాంకింగ్ భారీగా పుంజుకుంది. దేశంలో అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా తాజ్ హోటల్స్ బ్రాండ్ నిలిచింది. బ్రాండ్ సామర్థ్య సూచీలో ఈ కంపెనీ స్కోరు 100లో 89.4 పాయింట్లకు ఎగబాకింది. 83.4 శాతం వృద్ధితో అత్యంత వేగంగా పుంజుకున్న బ్రాండ్‌గా రేమండ్స్ నిలిచింది. భారత బ్రాండ్లన్నింటిలోకెల్లా అత్యధికంగా పెర్సిస్టెంట్స్ సిస్టమ్స్ ఈ ఏడాది ర్యాంకింగ్‌ను 25 స్థానాలు మెరుగుపరుచుకుంది. టాప్ టెన్ బ్రాండ్లతోపాటు రిలయన్స్ జియో (440వ స్థానం), ఎల్ అండ్ టీ (487వ స్థానం) కలిపి మొత్తం 12 భారత కంపెనీలకు గ్లోబల్ 500 లిస్ట్‌లో చోటు దక్కింది.
ప్రపంచ బ్రాండ్లలో అమెజాన్ నం.1 గా నిలిచింది.
ప్రపంచంలోని అత్యంత విలువైన 500 బ్రాండ్లలో అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది. 2022తో పోలిస్తే కంపెనీ బ్రాండ్ విలువ 15 శాతం (5,100 కోట్ల డాలర్ల మేర) క్షీణించినప్పటికీ ద్వితీయ స్థానం నుంచి ప్రథమ స్థానానికి ఎగబాకింది. ఏడాది కాలంలో 5,760 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువను కోల్పోయిన యాపిల్ ఒకటి నుంచి రెండో స్థానానికి జారుకుంది. గూగుల్ తృతీయ, మైక్రోసాఫ్ట్ నాలుగు, వాల్‌మార్ట్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామ్సంగ్ గ్రూప్, ఐసీబీసీ, వెరిజాన్, టెస్లా, టిక్‌టాక్ వరుసగా 6 నుంచి 10 స్థానాలను దక్కించుకున్నాయి. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు మెరుగైన స్థాయిలో వృద్ధిని నమోదు చేస్తుండడం ఇక్కడ గమనించదగ్గ విషయం.