Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. వరదలతోపాటు 40 నుంచి 50 అంశాలపై చర్చభారీ వర్షాలు, వరదలతోపాటు 40 నుంచి 50 అంశాలపై చర్చించనుంది కేబినెట్. ఆగస్టు 3 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేయనున్నారు. అయితే.. మరో మూడు నెలల్లో ఎన్నికలు కూడా జరగనుండడంతో కేబినెట్లో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ.. తెలంగాణ కేబినెట్లో చర్చకు రానున్న కీలకాంశాలేంటి?.. కేబినెట్లో చర్చించిన అనంతరం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోనున్నారు.నూతన సచివాలయం ప్రారంభం అయిన తర్వాత రెండవసారి తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సుమారు 40 నుంచి 50 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టంపై క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. భారీగా ఆస్తి, పంట నష్టం జరగడంతోపాటు రోడ్లు పెద్దయెత్తున దెబ్బతిన్నాయి. దాంతో.. నష్టాన్ని అంచనా వేసి, పరిహారంపై నిర్ణయం తీసుకోనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్దరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాదాపు 3వేల కోట్ల నష్టం జరిగినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌కు మరో మూడు నెలలే సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సీఎం కేసీఆర్ ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు.గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘నిరుద్యోగ భృతి’లాంటి అమలు కాని హామీలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. పాక్షికంగా అమలైన పంట రుణాల మాఫీ లాంటి అంశాలు కూడా చర్చకు రానున్నట్టు తెలిసింది. మరోవైపు.. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య విధ్యా అధిపతుల వయో పరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనలు, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా రెగ్యులరైజేషన్ బిల్లులపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. కేబినెట్లో చర్చించిన అనంతరం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోనున్నారు.
రెండోసారి సభ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం పంపితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక… ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు సోమవారం కేబినెట్ సమావేశం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించడంతో.. క్యాబినెట్లో చర్చించి ఆమోదం ముద్ర వేయనుంది ప్రభుత్వం.ఇదిలావుంటే.. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దాంతో.. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానుండటంతో.. పెండింగ్‌లోనున్న బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోనుంది. మొత్తంగా.. ఇవాళ్టి కేబినెట్లో భవిష్యత్ కార్యచరణపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడంతోపాటు.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.