Medak: గర్భిణీపై కూలిన ఇంటి పైకప్పు.. గర్భస్థ శిశువు మృతిగర్భిణీపై ఇంటి పైకప్పు కూలడంతో కడుపులోని గర్భస్థ శిశువు మృత్యువాత పడింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో బుధవారం (జులై 27) చోటు..
మెదక్, జులై 28: గర్భిణీపై ఇంటి పైకప్పు కూలడంతో కడుపులోని గర్భస్థ శిశువు మృత్యువాత పడింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో బుధవారం (జులై 27) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మెదక్‌లో నివాసం ఉంటోన్న మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల తొలికాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. మరో 15 రోజుల్లో ఆమెకు ప్రసవం కావాల్సి ఉండగా ఇంతలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షాలకు ఇంటి పైకప్పు నానిపోయి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో గర్భిణీ యాస్మిన్, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు హుటాహుటీనా వారిని మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరిశీలించి యాస్మిన్ కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. ఆమెను వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇక యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సుల్తానా కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు అందించారు.