Daggubati Purandeswari: చిన్నమ్మనే ఎందుకు సెలక్ట్ చేశారు..?వై.. పురంధేశ్వరి? యస్.. ఏపీ బీజేపీ చీఫ్‌గా పురంధేశ్వరినే అధిష్టానం ఎందుకు ఎంపిక చేసింది? ఇద్దరు కాపు నేతల తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరినే ఎందుకు సెలెక్ట్ చేసింది? టీడీపీని ఖాళీ చేసే వ్యూహంలో భాగమా? లేదంటే కమలం బలోపేతమే లక్ష్యమా? బీజేపీ అగ్రనాయకత్వం లెక్కేంటి? స్కెచ్చేంటీ? అధ్యక్ష మార్పుతో ఏపీలో ఎలాంటి రాజకీయ అద్భుతాలు చేయబోతుంది?ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైతే.. కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం కూడా బాగా ఉపయోగపడుతుందని భావించి హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో ఒకటైన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షులుగా ఉన్నారు. సీఎం జగన్ మరో బలమైన సామాజికవర్గ నేతగా ఉన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్‌తో పొత్తు కూడా ఉంది. ఈ క్రమంలో కాపు సామాజికవర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుందనే ప్రణాళికలో కేంద్ర పెద్దలు ఉన్నట్లు ప్రస్తుత మార్పు కనిపిస్తోంది.పురందేశ్వరి ఎంపిక వెనుక పక్కా వ్యూహం ఉందని స్పష్టమవుతోంది. టీడీపీకి ప్రధాన ఓట్ బ్యాంక్‌గా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గంపైన ప్రభావం చూపటంతో పాటుగా.. ఆ వర్గ ఓట్లను బీజేపీ వైపు ఆకర్షించేందుకు పురందేశ్వరికి బాధ్యతలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే టీడీపీకి మూలమైన నందమూరి కుటుంబంతో పాటుగా.. ఆ కుటుంబసభ్యులకి మద్దతిచ్చే ఓట్ల పైన బీజేపీ గురి పెట్టినట్లు స్పష్టం అవుతోంది. చంద్రబాబు వ్యవహార శైలి నచ్చకే గతంలో టీడీపీని వీడారు దగ్గుబాటి దంపతులు. ఇది కూడా ఎంపికలో భాగమని తెలుస్తుంది. పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో.. జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గర చేసుకోవచ్చని.. పార్టీకి సినీ గ్లామర్ కూడా కలిసొస్తుందని లెక్కలేసుకున్నట్టు సమాచారం.
పురంధేశ్వరి ఎంపిక సరే.. మరి సవాళ్ల సంగతేంటి? ఏపీకి బీజేపీ అధ్యక్షులుగా కన్నా, సోము పనిచేశారు. వీళ్ల వల్ల కానిది.. పురంధేశ్వరితో సాధ్యమవుతుందా.. పార్టీ బలంగా తయారవుతుందా? సోము వీర్రాజు అధ్యక్షతన ఏపీలో బీజేపీ గాడిలోనే వెళ్లినా… అక్కడక్కడ నిరసన గళాలు ఎదురయ్యాయి. మోనోపోలిగా నిర్ణయాలు తీసుకోవడం, ముక్కుసూటితనంతో అందరిని కలుపుకొని వెళ్లలేదు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి నేతలందర్నీ ఏకతాటి పైకి తీసుకురావడం పెద్ద సవాలే. మరోవైపు విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ఎలా ముందుకెళ్తారన్నది కూడా పెద్ద టాస్కే.