Telangana: బెల్లంపల్లిలో ఠాగూర్ సీన్ రిపీట్.. 3 నెలల బాలుడి మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు డాక్టర్స్ డ్రామా..మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఓ ప్రయివేట్ ఆస్పత్రి యాజమాన్యం చిన్నారి మృతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలపకుండా వైద్యం అందించినట్టు డ్రామా ఆడింది. వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. తమకు తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలోని హాస్పటల్ లోని దృశ్యం ఆవిష్కృతమైంది. జిల్లాలోని తాండూర్ మండలంలోని ఐబి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు జై కిషన్ కళావతిలు తమ 3 నెలల చిన్నారి జలుబుతో బాధపడుతుండడంతో శుక్రవారం రాత్రి బెల్లంపల్లిలోని నిత్య పిల్లల హాస్పిటల్ కు చికిత్స కోసం తీసుకువచ్చారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మూడు నెలల చిన్నారి మృతి చెందాడు. అయితే బాలుడు మరణించిన విషయం తల్లిదండ్రులకు తెలుపకుండా వైద్యులు డ్రామా ఆడుతూ చికిత్స చేస్తున్నట్టు నటించారు.చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని మంచిర్యాల, కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామని వెంటనే తీసుకెళ్లి చికిత్స అందించాలని తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు గుర్తించి వైద్యులను నిలదీశారు. దీంతో కొద్ది గంటల క్రితమే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలపడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుపట్టారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రికి తాళాలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. విషయం తెలిసిన వెంటనే బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శంకరయ్య ఆసుపత్రి వద్దకు చేరుకొని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. నిత్య హాస్పిటల్ యాజమాన్యంపై ఫిర్యాదిస్తే కేసు నమోదు చేస్తామని సిఐ శంకరయ్య తెలిపారు. మూడు నెలల పసికందు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.