పురుషుడిలా మారిన మహిళా టీచర్.. ఎందుకో తెలుసా?లక్నో: నచ్చిన కులం, మతంలోకి క్షణాల్లో మారినట్లు ఈమధ్య జండర్ కూడా అనుకున్నదే తడవుగా మర్చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్ జిల్లాకు చెందిన ఓ మహిళా టీచర్ లింగమార్పిడి చేయించుకొని పురుషుడిలా మారారు.ఖుదాగంజ్ పోలీసుస్టేషన్ పరిధిలోని నవాదా గ్రామానికి చెందిన సరితాసింగ్ దివ్యాంగురాలు. దివ్యాంగురాలైన ఆమెకు చిన్ననాటి నుంచి పురుషుల దుస్తులు ధరించడం, వారిలా హెయిర్‌స్టైల్ చేసుకునేది. ఆమె దివ్యాంగురాలు కావడంతో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. 2020లో సరితకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. అదే ఏడాది లింగమార్పిడి చేసుకోవాలని సరితా నిర్ణయించుకుంది. దీంతో లక్నోలో హార్మోన్ మార్పిడి థెరపీ చేయించుకోవడంతో మగవారి గొంతు, ముఖంపై గడ్డం రావడం వంటి మార్పులు కనిపించాయి.
ఈ ఏడాది 3 నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో సరితా లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని పూర్తిగా పురుషుడిగా మారారు. ప్రస్తుతం తన పేరును శరత్ సింగ్‌గా మార్చుకున్నారు. ఈ మేరకు షాజహాన్‌పుర్ జిల్లా మేజిస్ట్రేట్ ఉమేశ్ ప్రతాప్ సింగ్ నుంచి లింగమార్పిడి ధ్రువీకరణ సర్టిఫికెట్ కూడా అందుకున్నారు. చిన్నతనం నుంచి తన పక్కనే ఉండి.. తన అవసరాలన్నీ తీర్చుతూ వచ్చిన సవితా సింగ్ అనే యువతి జీవిత భాగస్వామిగా చేసుకోవాలని శరత్ సింగ్ నిర్ణయించుకున్నారు. త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు.