మేడ్చల్లో విషాదం.. గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కొని చిన్నారి మృతి!గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. గుళ్లో పెట్టే ప్రసాదమే తమ బిడ్డ ప్రాణాలను హరిస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. అప్పటి వరకూ తమ కళ్లముందే ఆడుకుంటూ అల్లరి చేసిన తమ చిన్నారి క్షణాల్లో..
హైదరాబాద్: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. గుళ్లో పెట్టే ప్రసాదమే తమ బిడ్డ ప్రాణాలను హరిస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. అప్పటి వరకూ తమ కళ్లముందే ఆడుకుంటూ అల్లరి చేసిన తమ చిన్నారి క్షణాల్లో మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లాకాలేదు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే..మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో సోనియా గాంధీనగర్లో నివాసముంటోన్న ఓ జంటకు మూడేళ్ల కుమారుడు జశ్వంత్ సంతానం. గురువారం తొలి ఏకాదశి కావటంతో కుటుంబమంతా సాయంత్రం చిన్నారిని తీసుకుని గుడికి వెళ్లారు. గుళ్లో కొబ్బరికాయ కొట్టి, అందులోని ఓ చిన్న ముక్కను తీసి ప్రసాదంగా బాలుడికి ఇచ్చారు. బాలుడు కొబ్బరి ముక్క తింటున్న క్రమంలో అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి ఊపిరాడక కాళ్లుచేతులు కొట్టుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే చిన్నారి ఊపిరాడక అసువులుబాశాడు. అప్పటి వరకు కళ్లముందు అల్లరి చేస్తూ గెంతులు వేసిన బిడ్డ క్షణాల్లోనే విగతజీవిగా మారటాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి.