CM Jagan: సామర్లకోటలో పేదల ఇళ్ల గృహప్రవేశాలు.. ఇవాళ కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం సామలకోట పట్టణంలో మెగా హౌసింగ్ కాలనీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి సామర్లకోటలో కాలనీని లాంఛనంగా ప్రారంభించిన వెంటనే వైఎస్ఆర్ జగనన్న పథకం కింద – వివిధ జగనన్న కాలనీలలో పూర్తి చేసిన సుమారు 5 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశ వేడుకలను ఒకేసారి నిర్వహించనున్నారు.కాకినాడ జిల్లా, అక్టోబర్ 12: ఇవాళ కాకినాడ జిల్లాలో పేదల ఇళ్ల గృహప్రవేశాలకు అంతా సిద్ధమైంది. సీఎం జగన్ సామర్లకోటలో సామూహిక గృహప్రవేశాల సంబరాలకు శ్రీకారం చుట్టనున్నారు. సామర్లకోట–ప్రత్తిపాడు రోడ్డులో ఉన్న జగనన్న కాలనీకి సీఎం వెళ్తారు. అక్కడ గృహ నిర్మాణాల ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. తర్వాత జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈటీసీ లేఅవుట్లో సామూహిక గృహప్రవేశాల్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్లు చేశారు.నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి గతంలో సీఎం జగన్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఇప్పుడా స్థలాల్లో పేదలకు ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. రాష్డ్ర గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరికాసేపట్లో సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో సామర్లకోట చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్తిపాడు రోడ్డులోని జగనన్న లేఆవుట్కు వెళ్తారు. ఈటీసీ లేఆవుట్‌లోని కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల్ని ప్రారంభిస్తారు. బహిరంగ సభలో లబ్దిదారులతో మాట్లాడతారు.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (గృహనిర్మాణం) అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేలా లబ్ధిదారులను చైతన్యపరిచేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామన్నారు. 2024 నాటికి పేదలెవరూ పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, 26 జిల్లాల్లోని ఇళ్ల నిర్మాణాల పురోగతిని నిశితంగా పరిశీలించేందుకు ఉన్నతాధికారులను నియమించామని వివరించారు.
జిల్లాలో నిరుపేదలకు 98,874 ఇళ్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. 25,325 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణానికి రూ.664 కోట్లు ఖర్చు చేశారు. DWCRA గ్రూపుల్లోని 72,000 మంది సభ్యులకు అదనపు రుణాలు మంజూరు చేయబడ్డాయి. చేబ్రోలు లేఅవుట్లో మంజూరైన 181 ఇళ్లలో 90 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్లను గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి జగన్.
హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుండగా, సిమెంట్, స్టీల్ సహా నిర్మాణ సామగ్రిని సబ్సిడీ ధరలకు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా తక్కువ ధరలకే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు, ఇతర మెటీరియల్‌లను అందజేస్తోందని తెలిపారు. హౌసింగ్ కాలనీల్లో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.2,900 కోట్లు వెచ్చించామన్నారు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా.