AP News: పుస్తకాల బ్యాగులో నక్కిన తేలు… విద్యార్థి బుక్ కోసం చేయి పెట్టగా..
తేలును లైట్ తీసుకోవడానికి లేదు. కొన్ని తేళ్లు చాలా విషపూరితమైనవి. అవి కుట్టిన వెంటనే.. పాము కాటు మాదిరిగానే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. నాటు వైద్యం చేసినా.. అశ్రద్ద చేసినా ఫలితం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పీహెచ్సీలో సైతం తేలు కాటు విరుగుడు మందును అందుబాటులో ఉంచుతున్నాయి ప్రభుత్వాలు.. సో అజాగ్రత్తగా ఉండకండి…
అది ప్రకాశం జిల్లాలోని రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్. సమయం సాయత్రం 4 గంటల ప్రాంతం… క్లాసులు అయిపోయాయి… ఇక స్టడీ అవర్ మిగిలి ఉంది… ఎప్పటిలాగే స్టడీ అవర్‌లో పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నాడు 9వ తరగతి విద్యార్ధి రవికిరణ్. మధ్యలో మరో పుస్తకం కోసం వెతికాడు… తన ముందున్న పుస్తకాల్లో కనిపించకపోవడంతో పక్కనే ఉన్న పుస్తకాల బ్యాగ్‌లో చేయిపెట్టాడు… ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టయింది… అమ్మా… అంటూ పెద్దగా కేక వేశాడు… దీంతో ఉపాధ్యాయులు, ఇతర విద్యార్ధులు పరుగులు పెట్టి రవికిరణ్‌ను చుట్టుముట్టారు… పుస్తకాల బ్యాగులో చేయిపెట్టడంతో ఏదో కుట్టినట్టయిందని రవికిరణ్ చెప్పడంతో బ్యాగులో వెతికారు… బ్యాగులో ఉన్న తేలును చూసి విద్యార్ధులు భయపడిపోయారు… వెంటనే దూరంగా జరిగారు… ఈ ఘటనతో బిత్తరపోయిన ఉపాధ్యాయులు వెంటనే రవికిరణ్‌ను ఆసుపత్రికి తరలించి తేలును చంపేశారు… అయితే రవికిరణ్ పరిస్థితి విషమించడంతో గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు… అక్కడ చికిత్స పొందుతూ గురువారం రవికిరణ్ చనిపోయాడు… దంతో రవికిరణ్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది…
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం జడ్పి హైస్కూల్లో తేలు కాటుకు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మార్కాపురం మండలంలోని నాయుడుపల్లి దళిత కాలనీకి చెందిన కోట్ల రవికిరణ్ (14) రాయవరంలోని జడ్పీ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే పాఠశాల అయిపోయిన తరువాత స్టడీ అవర్ కోసం కూర్చున్నాడు. పుస్తకాలు తీసే క్రమంలో తన బ్యాగ్‌లో చేయి పెట్టిన సమయంలో లోపల ఉన్న తేలు రవికిరణ్‌ను కుట్టింది. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట రామకృష్ణ విద్యార్ధి రవికిరణ్‌ను మార్కాపురంలోని జిల్లా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం విద్యార్ధి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
విద్యార్థి తల్లిదండ్రులు కోట్ల రామకోటేశ్వరరావు, కొండమ్మలకు ముగ్గురు సంతానం కాగా రవికిరణ్ చివరివాడు. కోటేశ్వరరావు పాస్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చేతికందివచ్చిన కొడుకు తేలుకాటుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తేలును లైట్ తీసుకోవడానికి లేదు. కొన్ని తేళ్లు చాలా విషపూరితమైనవి. అవి కుట్టిన వెంటనే.. పాము కాటు మాదిరిగానే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు.