AP News: ఫోన్ పే వాడుతున్నారా..! తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి..చేతిలో సెల్‌ఫోన్.. దానిలో ఒక మనీ ట్రాన్సఫర్ యాప్ ఈరోజుల్లో కామన్‌గా మారాయి. డిజిటల్ పేమెంట్స్‌లో దూసుకుపోతున్న దేశానికి సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, చిరు ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులే టార్గెట్‌గా ఏలూరు జిల్లాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.చేతిలో సెల్‌ఫోన్.. దానిలో ఒక మనీ ట్రాన్సఫర్ యాప్ ఈరోజుల్లో కామన్‌గా మారాయి. డిజిటల్ పేమెంట్స్‌లో దూసుకుపోతున్న దేశానికి సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో చిత్తు చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, చిరు ఉద్యోగులు, చిన్నా చితక వ్యాపారులే టార్గెట్‌గా ఏలూరు జిల్లాలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సైబర్ క్రైమ్ నేరాలకు అసలు ఎలా అడ్డుకట్ట వేయాలి. ఇలాంటివి జరిగితే ఎవరిని సంప్రదించాలి. ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై ఇప్పటికే పోలీసులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల ముదినేపల్లిలో ఇద్దరు వ్యక్తులు పుల్లల అడితికి వెళ్లారు. అక్కడ అడితి యజమానితో తాము గంగానమ్మ సంబరాలు చేసుకుంటున్నామని, పుల్లలు కావాలని అడిగారు. అయితే అడితి యజమాని మీరు అడిగిన పుల్లలకు రూ.1500 ఖర్చు అవుతుందని చెప్పాడు. దాంతో తమ ఓనర్ కైకలూరులో ఉన్నాడని రూ 1500 మీకు ఫోన్ పే చేస్తాడని.. అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం ఒక రూపాయి తమ ఓనర్‌కి ట్రాన్సాక్షన్ చేయమని.. వచ్చిన వ్యక్తులు అడితి యజమానితో చెప్పారు. అది నమ్మిన అతడు ఒక రూపాయి వారు చెప్పిన ఎకౌంట్‌కు పంపారు. అయితే ఎంతసేపటికి డబ్బులు రాకపోవడంతో అడితికి వచ్చిన వ్యక్తులు తమ యజమాని బిజీగా ఉన్నారంటూ, తమ దగ్గర ఉన్న రూ.1500 ఆయనకు ఇచ్చి పుల్లల కోసం ఆటోను పంపిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం ఇంటికి వెళ్లి చూసేసరికి అడితి యజమాని అకౌంట్లో సుమారు 68 వేల రూపాయలు కట్ అయ్యాయి. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.అలాగే ఏలూరులో ఒక చిరుద్యోగి శాలరీ మొత్తం దొంగిలించారు సైబర్ నేరగాళ్లు. తప్పుగా ట్రాన్సాక్షన్ జరిగిందని కాల్ సెంటర్‌కు కాల్ చేస్తే ఎకౌంట్లో ఉన్న శాలరీ మొత్తం ఊడ్చేశారు. అలాగే ఏజెన్సీ మండలమైన కుక్కునూరులో ఓ పెట్రోల్ బంక్‌కు ఇద్దరు యువకులు వచ్చారు. అత్యవసరం, ఆరోగ్యం బాలేదని చెప్పి రూ.3 వేలు కావాలని, ఫోన్ పే చేస్తామని నమ్మించారు. ఫోన్ పేలో మనీ ట్రాన్సాక్షన్ అయినట్లు మెసేజ్ చూపించారు. దాంతో పెట్రోల్ బంక్ సిబ్బంది వారికి రూ.3 వేలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్రోల్ బంక్ ఎకౌంట్లో ఆ డబ్బులు కనిపించకపోవడంతో వారు సైబర్ క్రైమ్‌కు గురైనట్లు తెలుసుకున్నారు. ఇలా చాలామంది తెలిసో తెలియకో సైబర్ క్రైమ్ నేరగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు కూడా రోజుకొక కొత్త పథకంతో బాధితులకు ఏరవేస్తున్నారు. అయితే ఇలాంటి నేరాల్లో నేరస్తుల్ని ఎలా పట్టుకుంటారు. వారి దగ్గర నుంచి మనీ రికవరీ ఎలా చేస్తారనేది ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించి చాలామంది ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతున్నారు. నేరం జరిగినప్పుడు ఎవరిని సంప్రదించాలో, ఫిర్యాదు ఎలా చేయాలో తెలియక సైబర్ క్రైమ్ నేరాలు వెలుగులోకి రావడం లేదు. అయితే ఇటీవల కాలంలో పోలీసులు సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. అ క్రమంలోనే స్థానిక ప్రజలకు వాట్సాప్ సందేశాలు పంపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల మాటలని నమ్మి ఓటీపీలు చెప్పవద్దని, అదేవిధంగా ఆఫర్ లంటూ ఎవరికైనా ఏ విధమైన ఫోన్ కాల్స్ వచ్చినా.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలు కోరుతున్నారు. ప్రజల్లో అవగాహన ద్వారా మాత్రమే సైబర్ క్రైమ్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమనే ఉద్దేశంలో పోలీసులు పని చేస్తున్నారు. అంతేకాక ఎవరైనా సైబర్ నేరాల గురైతే హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.