Road Accident: ఢీ కొట్టాడు.. దారి మధ్యలో మృతి చెందడంతో రోడ్డు పక్కన మృతదేహాన్ని పారేశాడు..అతివేగం ఓ అమాయ ప్రాణాన్ని బలి తీసుకుంది. బొలేరో వాహనంలో అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న పాదచారిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలై బాధతో విలవిలలాడుతున్న అతన్ని కాపాడేందుకు..
ఆమనగల్లు, జులై 28: అతివేగం ఓ అమాయ ప్రాణాన్ని బలి తీసుకుంది. బొలేరో వాహనంలో అతివేగంగా ప్రయాణిస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న పాదచారిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలై బాధతో విలవిలలాడుతున్న అతన్ని కాపాడేందుకు నిందితుడు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. ఐతే మార్గం మధ్యలోనే క్షతగాత్రుడు మృతి చెందడంతో మృతదేహాన్ని రోడ్డు పక్కన పారేసి పారిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన మహబూబ్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై బాల్రామ్ వివరాల ప్రకారం..ఆమనగల్లు పరిధిలో చంద్రాయన్పల్లి తండాకు చెందిన జఠావత్ బద్యానాయక్ అలియాస్ సురేష్ (39) అనే వ్యక్తి సూర్యలక్ష్మి కాటన్ మిల్లులో పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మిల్లులో పనికి పయనమైన సురేష్ గురువారం తెల్లవారుజామున శ్రీశైలం జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తోన్న బొలేరో వాహనం అదుపుతప్పి అతన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంతలో ఢీ కొట్టిన బొలేరో డ్రైవర్ ఏమనుకున్నాడో బాధితుడిని చికిత్స కోసం కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్ది దూరం వెళ్లగానే మార్గం మధ్యలోనే సురేష్ మృతి చెందాడు.
దీంతో డ్రైవర్ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడవేసి పారిపోయాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎవరైనా హత్య చేశారేమోనని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో సురేష్ రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాల్రామ్ వెల్లడించారు.