Hyderabad: సిటీ శివార్లో ఉంటున్నవారికి అలెర్ట్.. అజాగ్రత్తగా ఉన్నారో.. అంతే సంగతులునగర శివారులో దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్లను, రోడ్లమీద వెళ్ళేటటువంటి వారిని టార్గెట్ చేసుకొని దొరికినంత దోచుకొని పరారవుతున్నారు. పోలీసులకు సైతం చిక్కకుండా కళ్ళు కప్పి దొంగతనాలకు పాల్పడుతుంది ఈ ముఠా. జల్సాలకు, ఈజీ మనీ కి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వరస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి 16 తులాల బంగారంతో పాటు, పది తులాల వెండిని, రెండు బైకులను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహినగర్ క్యూబానగర్ ఎలైన్ నగర్లో దొంగతనాలకు పాల్పడుతూ ఎవరి కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.. దొంగతనం చేసిన బైక్‌లను వినియోగించి వాటి మీద కాలనీలలో రెక్కి నిర్వహించి చోరీలకు పాల్పడడమే ఈ ముఠా యొక్క నైజం. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కాజా, ఆరిఫ్ మరొక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.. ఇప్పటివరకు ఈ ముగ్గురు కలిసి ఒక్క బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 21 దొంగతనాలకు పాల్పడ్డారు..A1గా ఉన్న కాజాపై 2021 డిసెంబర్లోనే పోక్సో కేసును నమోదు చేశారు కమాటి పూర్ పోలీసులు.. ఆ కేసులో జైలుకు వెళ్లిన కాజా అక్కడి ఉన్న నేరస్తులతో పరిచయాలు పెంచుకొని సలహాలను తీసుకున్నాడు.. అనంతరం జైలు నుండి విడుదలై బయటకు వచ్చాక అతని బంధువులైన ఆరిఫ్ మరొక మైనర్ తో దొంగతనాలకి తెరలేపాడు. అయితే ఖాజాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిని చూసుకునేందుకు, జల్సాల కోసం ఈజీ మనీ అలవాటుపడి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు కాజా ఎవరికంటా పడకుండా ఆధారలు సైతం లేకుండా దొంగతనాలకు పాల్పడ్డాడు. సంవత్సరం నుండి ఎవరికి చిక్కకుండా తప్పిచుకున్నాడు.. ఈసారి కాజా మీద కన్నేసిన పోలీసులు అతనితోపాటు మరొక ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసి రిమాండ్ కు తరలించారు.