Dog Race: చిన్నారిదొడ్డి గ్రామంలో కుక్కల పరుగు పోటీలు.. నువ్వా నేనా అంటూ పరుగులు తీసిన శునకాలు..భారీగా నగదు బహుమతిమనుషులు, పశువులకు పరుగుల పోటీలు నిర్వహించడం చూశాం.. కానీ.. జల్లికట్టు తరహాలో కుక్కల పోటీలు నిర్వహించడం ఎప్పుడైనా చూశారా?.. కుక్కలకు పోటీలు ఏంటి అనుకుంటున్నారా?.. అవును.. చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో కుక్కల పరుగు పోటీలు నిర్వహించారు.
సర్వ సాధారణంగా పండగలు, ముఖ్యమైన సమయాల్లో సంతోషం కోసం, సరదాగా గడపడానికి కోడి పందాలు, ఎద్దుల పందాలు, పొట్టేళ్ల పందాలు, చివరకు పందుల పరుగుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన జంతువులకు భారీ మొత్తంలో బహుమతులు సైతం ప్రకటిస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పోటీల్లో పాల్గొనే కోళ్లకు, పందులకు, ఎద్దులు వంటి వాటిని ప్రత్యేక శ్రద్ధతో పెచుతారు. వాటికి స్పెషల్ ట్రైనింగ్ వాటిని పోటీకు సిద్ధం చేస్తుంటారు.సంక్రాంతి వచ్చిందంటే చాలు కోనసీమలో కోళ్ల పందాలు, చిత్తూరు జిల్లాలో తమిళనాడు సంప్రదాయాన్ని పాటిస్తూ జల్లికట్టు పోటీలను నిర్వహిస్తారు. అయితే అదే చిత్తూరు జిల్లాలో ఎద్దుల మధ్య జరిగే జల్లికట్టు పోటీలను తలదన్నేలా కొత్తగా కుక్కల పోటీలను నిర్వహించారు కొందరు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి గ్రామంలో వింత ఆచారం ఉంది. ఇక్కడ కుక్కల పందేలను నిర్వహిస్తారు. స్థానికంగా వ్యవసాయ బీడు భూమిలో ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి.. కుక్కల పోటీలు నిర్వహిస్తుంటారు. ఇక.. పోటీలు జరుగుతున్నాయని తెలుసుకున్న పరిసర గ్రామాల యువత.. తమ శునకాలను పరుగులెత్తించారు.
ఇక.. చిన్నారిదొడ్డిలో నిర్వహించిన కుక్కల పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కుక్కల యజమానులు తమ శునకాలను తీసుకుని వచ్చి పోటీల్లో దింపారు. ఇంకేముంది.. నువ్వా-నేనా అంటూ శునకాలు పరుగు తీశాయి. భారీస్థాయిలో నిర్వహించిన ఈ శునకాల పోటీలను చూడటానికి స్థానికులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో.. ఆ ప్రాంతమంతా సందడి వాతావారణ నెలకొంది. ఇక.. పోటీల్లో గెలిచిన కుక్కలకు నగదు, బహుమతులు అందజేశారు నిర్వాహకులు.తమ శక్తిని చూపిస్తూ సత్తా చాటిన శునకాల యజమానులకు మొత్తం ఇరవై బహుమతులను అందించారు. ఈ కుక్కల పోటీలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. రకరకాల ఫన్నీ కామెంట్లు చేశారు.