బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం, విపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసి మోదీ సర్కారు హ్యాట్రిక్ ప్రయత్నాలకు కళ్లెం వేయాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. అయితే బీజేపీని ఓడించాలంటే విపక్షాల మధ్య ఐక్యత కావాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ దిశగా కొందరు విపక్ష నేతలు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ అధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం, విపక్షాలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ 2024 సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు ఏకమై ఉమ్మడి వ్యూహంతో ముందుకెళితే.. కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు తమ అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో విపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబించాలని సూచించారు. బీజేపీని ఓడించడం సాధ్యమేనని.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపే దానికి ఉదాహరణగా సిబల్ వ్యాఖ్యానించారు.
ఒకే సీటులో విపక్ష అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు బరిలో నిలిస్తే బీజేపీకి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీపై విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు అనుకూలమైన పరస్థితులు ఉన్నాయన్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్ బలంగా ఉందని.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీపై విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే విషయంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. తమిళనాడు విషయానికే వస్తే.. డీఎంకే బలంగా ఉందన్న సిబల్.. ఆ రాష్ట్రంలో డీఎంకేతో కాంగ్రెస్కు పొత్తు ఉన్న కారణంగా అక్కడ కూడా సీట్ల పంపకాల్లో ఎటువంటి సమస్య ఉండదన్నారు. విపక్షాల మధ్య ఐక్యతకు తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సమస్య ఉండవచ్చన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో విపక్ష కూటమికి అవకాశాలు లేకపోవచ్చన్నారు.
పాట్నాలో జరిగే విపక్ష నేతల సమావేశంలో భారత్ కొత్త విజిన్పై చర్చించాలని కపిల్ సిబల్ సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాల పోరాటం ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కాదు..పోరు మొత్తం ఆయన వ్యాప్తి చేయాలనుకుంటున్న సిద్ధాంతాలపైనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష కూటమి తరఫు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పుడే చర్చ అవసరం లేదని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు.