India vs West Indies: భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జులై 12 నుంచి 16 వరకు జరగనుండగా, రెండో మ్యాచ్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.
Upendra Yadav: భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సిరీస్‌కు టీమ్ ఇండియాను ఇంకా ప్రకటించలేదు. జట్టులో గణనీయమైన మార్పులు చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందని వార్తలు వినిపిస్తు్నాయి. ఇందుకోసం సెలక్టర్లు ఇప్పటికే కొంతమంది యువ ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసిందంట. ఈ జాబితాలో ఉపేంద్ర యాదవ్ పేరు కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
ఉపేంద్ర యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్. ఇప్పటికే దేశీయ రంగంలో తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే ఇప్పటి వరకు అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు.
భారత జట్టులో అవకాశం దక్కించుకున్న కేఎస్ భరత్ 8 ఇన్నింగ్స్ ల్లో 129 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు భారత్ తడబడింది.
దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త వికెట్ కీపర్‌పై కన్నేసింది. ఈసారి దొరికిన పేరు ఉపేంద్ర యాదవ్. రంజీ క్రికెట్లో యూపీ తరపున 47 ఇన్నింగ్స్‌లు ఆడిన ఉపేంద్ర 5 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో మొత్తం 1666 పరుగులు చేశాడు. కేఎస్ భరత్ జట్టు నుంచి తప్పుకుంటే టీమిండియాలో ఇషాన్ కిషన్, ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్లుగా కనిపిస్తారని సమాచారం.
అయితే మరోవైపు కేఎస్ భరత్‌కి మరోసారి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో కేఎస్ భరత్‌కు అవకాశం లభిస్తుందా లేదా ఉపేంద్ర యాదవ్ ఎంట్రీ ఇస్తాడా అనేది ఆసక్తిగా మారింది. భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జులై 12 నుంచి 16 వరకు జరగనుండగా, రెండో మ్యాచ్ జూలై 20 నుంచి 24 వరకు జరగనుంది.