కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..? పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాషాయ కండువా (BJP) కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..? ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..? పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాషాయ కండువా (BJP) కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..? ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవే అక్షరాలా నిజమనిపిస్తోంది. ఇంతకీ వెంకటరెడ్డి ఏం చేయబోతున్నారు..? కాంగ్రెస్‌ను కాదని వెళ్లిన వారంతా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..
కోమటిరెడ్డి బ్రదర్స్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మంచి గుర్తింపు ఉంది.. కాంగ్రెస్‌తోనే పొలిటికల్ కెరియర్ ప్రారంభమైంది. వైఎస్ (YSR) హయాంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత బ్రదర్స్ (Komatireddy Brothers) ఇద్దరికీ పరిస్థితులు అనుకూలించలేదు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ బ్రదర్స్ ఇద్దరూ సిట్టింగ్‌లుగానే ఉంటూ వస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయ పార్టీలో చేరడం.. రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసిందే. అయితే సొంత తమ్ముడే పార్టీని వీడి వెళ్లడంతో.. వెంకటరెడ్డి కూడా అదేబాటలో నడుస్తారని వార్తలు వచ్చాయి కానీ.. అవేమీ జరగలేదు. మరోవైపు.. కోమటిరెడ్డి శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్యను రాజకీయాల్లోకి తెచ్చి నకిరేకల్ నుంచి నిలిపి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయన కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రైట్ హ్యాండ్‌గా ఉన్న తమ్ముడు.. ఇటు శిష్యుడు ఇద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో వెంకటరెడ్డి బలం తగ్గిపోయిందని ఫీలవుతున్నారట. అందుకే ఇక ఆ ఇద్దర్నీ తిరిగి కాంగ్రెస్‌లో చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరూ మళ్లీ తనవెంట ఉంటే.. వెయ్యి ఏనుగుల బలమున్నట్లు అని కోమటిరెడ్డి తన అత్యంత సన్నిహితులతో చెప్పుకున్నారట. అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి సొంత గూటికి చేర్చేందుకు మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇప్పుడే ఎందుకు..?
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో పార్టీకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. పైగా అప్పటి వరకూ బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనుకున్న బీఆర్ఎస్ బహిష్కృత నేతలు, బీఆర్ఎస్ కీలక నేతలు, కాంగ్రెస్ ఉద్ధండులు సైతం వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎవరు చూసినా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే పార్టీని గెలిపించుకోవాలని రాష్ట్ర నేతలు, ఢిల్లీ పెద్దలు.. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ చాణక్యులు అందరూ రంగంలోకి దిగిపోయారు. మరోవైపు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైతం వ్యూహాలకు పదనుపెట్టారు. ఇవన్నీ కలగలిపి కచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత, బీజేపీలోని వర్గ విభేదాలు ఇవన్నీ ప్లస్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. పైగా ఇటీవల కాంగ్రెస్ చేయించిన సర్వేల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు వస్తాయని రావడంతో నేతలు చాలా ధీమాతో ఉన్నారు. అందుకే బీజేపీలో చేరాలనుకున్న నేతలందరి చూపు ఇప్పుడు కాంగ్రెస్‌వైపే ఉంది. రేపో.. మాపో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), జూపల్లి కృష్ణరావు (Jupally Krishna Rao), కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పిడమర్తి రవితో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ ఒకరిద్దరు బడా నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పనిలో పనిగా తమ్ముడు, శిష్యుడిని కూడా పార్టీలోకి ఆహ్వానించేశారట.
అధిష్టానంతో చర్చలు..!
ఇప్పటికే తన సోదరుడు, లింగయ్యతో మంతనాలు జరిపిన కోమటిరెడ్డి.. అక్కడ్నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని.. అందుకే వారిచేరికపై అధిష్టానంతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. పొంగులేటి, జూపల్లి చేరిక తర్వాత.. రాజగోపాల్ రెడ్డి, లింగయ్య కండువాలు కప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా సోదరుడి చేరికపై మీడియా ప్రశ్నించగా కచ్చితంగా అందరూ వస్తారని కోమటిరెడ్డి చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీల్లో చేరిన నేతలపైనే అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. మరోవైపు.. పోటీచేసే అవకాశమిస్తే కచ్చితంగా కండువా కప్పుకుంటామని ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కీలక నేతలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి టచ్‌లో ఉన్నారట. ఏయే నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు లేరో వాటిపైనే అధిష్టానం దృష్టిసారించిందట. ఈ క్రమంలోనే ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టిందట. కోమటిరెడ్డి ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయో.. శిష్యుడు, సోదరుడు తిరిగి కండువా కప్పుకుంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.