చిరంజీవి మరోసారి తాతయ్యారు. రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ బుల్లి యువరాణిని చూసేందుకు మెగా, కామినేని కుటుంబాలు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలివచ్చాయి…
చిరంజీవి మరోసారి తాతయ్యారు. రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. తమ బుల్లి యువరాణిని చూసేందుకు మెగా, కామినేని కుటుంబాలు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలివచ్చాయి. అభిమానుల రాకతో అపోలో ఆస్పత్రి ప్రాంగణం సందడిగా మారింది. చిరంజీవి, సురేఖ దంపతులు ఉదయాన్నే ఆస్పత్రికి వచ్చి మనవరాలిని చూసి మురిసిపోయారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ‘‘మా చేతుల్లో ఒక బిడ్డను పెట్టండిరా’ అని చాలా రోజులుగా రామ్‌చరణ్, ఉపాసన దంపతులను అడుగుతున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమాభిమానాలతో ఇప్పుడు పండంటి ఆడపిల్లను మాకిచ్చారు. మా ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం. పాప పోలిక ఎవరనేది ఇప్పుడే చెప్పలేను. మా మనవరాలు మంచి ఘడియల్లో పుట్టిందని పెద్దలు చెబుతున్నారు. తను కడుపులో పడినప్పటి నుంచే ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంది. రామ్‌చరణ్‌కు వచ్చిన పేరు ప్రఖ్యాతలు, వరుణ్‌తేజ్ నిశ్చితార్థం ఇలా మా ఇంట అన్నీ శుభపరిణామాలే. మా ఇలవేల్పు ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన మంగళవారం నాడు ఆడబిడ్డను మనవరాలిగా ప్రసాదించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడివారితో పాటు విదేశాల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులు మా కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు’ అన్నారు.
మనవరాలు తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన ఆనంద కర క్షణాలను చిరంజీవి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘లిటిల్ మెగా ప్రిన్సె్సకు స్వాగతం. నీ రాక మమ్మల్ని, మెగా ఫ్యామిలీని ప్రేమించే కోట్లాదిమంది అభిమానుల్ని, రామ్‌చరణ్-ఉపాసన దంపతుల్ని ఆనందపరిచింది. మమ్మల్ని తాతయ్య, నాయనమ్మను చేసినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మెగా ఫ్యామిలీకి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ దంపతులు, నిర్మాత డీవీవీ దానయ్య రామ్‌చరణ్, ఉపాసనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, లావణ్య త్రిపాఠి, సాయితేజ్, పవన్ కల్యాణ్ తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఉపాసన బిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో మూడో తరం అడుగుపెట్టినట్లైంది. ఈ పాపతో కలిపి చిరంజీవికి ఐదుగురు మనవరాళ్లు. పెద్ద కూతురు సుస్మితకు సమారా, సంహిత… చిన్న కూతురు శ్రీజకు నివ్రితి, నివిష్క ఉన్నారు.