ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తుండటంతో కొందరు నేతలు చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తున్నారు.. ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటరివ్వాలో తెలియట్లేదేమో కానీ.. ఒక్కోసారి తనకు సంబంధంలేని విషయాల్లో తల దూరుస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan kalyan) వారాహి యాత్రతో (Varahi Yatra) జిల్లాల పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు..
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తుండటంతో కొందరు నేతలు చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తున్నారు.. ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటరివ్వాలో తెలియట్లేదేమో కానీ.. ఒక్కోసారి తనకు సంబంధంలేని విషయాల్లో తల దూరుస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan kalyan) వారాహి యాత్రతో (Varahi Yatra) జిల్లాల పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఏ నియోజకవర్గాల్లో అయితే పవన్ పర్యటిస్తున్నారో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రుల గురించి మాట్లాడుతూ వారి అవినీతి చిట్టాను బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (MLA Dwarampudi) గురించి సేనాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ విమర్శలు, ఆరోపణలు చేశారు కాబట్టి ద్వారంపూడి కౌంటర్ ఇవ్వడమో.. ప్రతివిమర్శలు చేయడం అనేది కామన్. అయితే.. ఈ ఇద్దరికీ సంబంధంలేని వ్యక్తి కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) రియాక్ట్ కావడం ఎందుకు తేడా కొడుతోంది.. అసలు ముద్రగడ ఎందుకు రియాక్ట్ అయ్యారు..? కాపు నేతలు (Kapu Leaders) ఈ వ్యవహారంపై ఏమనుకుంటున్నారు..? ఇటీవల ముద్రగడపై వచ్చిన వార్తలేంటి..? ఆ వార్తలకు ఈ రియాక్షన్కు ఏంటి సంబంధం అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..!
ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్నా నిర్ణయించేది కాపులన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్నదే. సుమారు కోటీ 20 లక్షలు దాకా ఈ సామాజిక వర్గం చుట్టూనే ఏపీ రాజకీయాలు (AP Politics) తిరుగుతుంటాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే కాపులు ఎటువైపు ఉంటే అదే పార్టీ పక్కాగా గెలుస్తుంది. కాపు నేత వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన 1988 ఎన్నికలు, 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలను కాస్త పరిశీలిస్తే వాస్తవాలేంటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయ్..! ఇంత మెజార్టీ ఉన్న కాపులకు రిజర్వేషన్ల (Kapu Reservations) విషయంలో మాత్రం న్యాయం జరగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా రిజర్వేషన్ అంటే చాలు మిన్నకుండిపోతున్నాయి. 2019 ఎన్నికల ముందు రిజర్వేషన్ ప్రయత్నాలు చేస్తాననని.. ప్రత్యేక నిధులతో కాపు కార్పొరేషన్ (Kapu Corporation) ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ (YS Jagan) మాటిచ్చారు. అయితే రిజర్వేషన్ రాలేదు.. కార్పొరేషన్ అయితే ఏర్పాటైంది కానీ నిధుల సంగతి దేవుడెరుగు. అయితే గత ఎన్నికల్లో గెలవడానికి వందకు వంద శాతం వైసీపీకి ముద్రగడ సపోర్టు చేశారన్నది అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ముద్రగడకు వైసీపీ కండువా కప్పి.. కాకినాడ ఎంపీ సీటు ఇవ్వాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే విషయంపై ఆ మధ్య ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ప్రత్యేక కథనం పెను సంచలనమైంది. అయితే.. తాజా పరిణామాలతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అదెలాగంటే.. ద్వారంపూడిని పవన్ విమర్శిస్తే.. ముద్రగడకు వచ్చిన నష్టమేంటి..? పవన్ను విమర్శిస్తూ మూడు పేజీల లేఖ రాయాల్సిన అవసరమేంటి..? అనేది ఇప్పుడు కాపుల్లో మెదులుతున్న ప్రశ్న. దీనంతటికీ సమాధానం ముద్రగడ వైసీపీలో చేరుతున్నారు.. పోటీ కూడా చేస్తున్నారన్నదే సమాధానమని రాజకీయ విశ్లేషకులు సైతం కుండ బద్ధలు కొడుతున్నారు.
వన్ అండ్ ఓన్లీ పవన్..!
కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు నాయకత్వం వహించే నేతలు ఎవరూ లేరు.. ఎందుకంటే ముద్రగడను ఇప్పుడు సొంత సామాజిక వర్గం నమ్మట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే తుని ఘటనకు ముందు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముద్రగడలో చాలా మార్పు వచ్చిందని కాపు నేతలు చెప్పుకుంటున్నారు. ఎంతసేపూ అటు టీడీపీని.. ఇటు జనసేనన విమర్శించడం తప్పితే అధికార వైసీపీని మాత్రం ఏనాడు ఆయన విమర్శించిన దాఖలాల్లేవ్. దీన్ని బట్టే పద్మనాభం వైసీపీ వకల్తా పుచ్చుకున్నారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కాపులకు ఉన్న ఒకే ఒక్క ఆశ.. వన్ అండ్ ఓన్లీ పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆ సామాజిక వర్గం విశ్వసిస్తోంది. అందుకే ఎంతసేపూ వాళ్లకు, వీళ్లకూ కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పీఠమెక్కించాలని భావిస్తున్నారట. అందుకే పవన్ కూడా మునపటితో పోలిస్తే ఇప్పుడు తన పంథా మార్చుకుని కాపులకు దగ్గరయ్యేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కూడా. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన ముద్రగడ.. పవన్ మార్క్ చెరిపేయాలని ఇలా విషం కక్కుతూ లేఖ రాశారనే విమర్శలు సర్వత్రా వినినిపిస్తున్నాయి.
మొత్తానికి చూస్తే.. సంబంధంలేని విషయంలో ముద్రగడ వేలు పెట్టడం వెనుక ఇంత పెద్ద కథుందన్న మాట. బహుశా వైసీపీలో చేరుతున్నారు కాబట్టే ఇప్పుడే రాజకీయాలు మొదలెట్టేశారేమో అనుమానం కూడా కలగక తప్పదు. ఇక పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? ఇక తగ్గేదేలే అని డైరెక్ట్ అటాక్ చేస్తారా..? లేకుంటే అస్సలే స్పందించరో తెలియాల్సి ఉంది. అయితే ముద్రగడకు టీడీపీ నుంచి బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. అంతేకాదు ఇకపై ఆయన రాసే ప్రతిలేఖకు తాను రియాక్ట్ అవుతానని కూడా చెప్పుకొచ్చారు. మొన్నటి వరకూ ‘చెప్పు’పై రాజకీయం జరిగితే ఇప్పుడు ‘లేఖ’ కాక పుట్టిస్తోంది.. మున్మందు ఏపీ ప్రజలు ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో..!