అసలు సిసలు టెస్టు మజా అంటే ఇదీ. యాషెస్ తొలి మ్యాచ్ సంచలన రీతిలో ఆరంభమై.. అదే రీతిన ముగిసింది. 281 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన వేళ.. ఇక ఓటమి ఖాయమేననిపించింది. ఎందుకంటే అప్పటికి మరో 54 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఓ స్పెషలిస్ట్
కంగారూల అద్భుత విజయం
రెండు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌కు షాక్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 282/8
బర్మింగ్‌హామ్: అసలు సిసలు టెస్టు మజా అంటే ఇదీ. యాషెస్ తొలి మ్యాచ్ సంచలన రీతిలో ఆరంభమై.. అదే రీతిన ముగిసింది. 281 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ 227 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన వేళ.. ఇక ఓటమి ఖాయమేననిపించింది. ఎందుకంటే అప్పటికి మరో 54 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఓ స్పెషలిస్ట్ బ్యాటర్ కూడా లేడు. అటు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా తమదే విజయమనే భావనలో కనిపించారు. కానీ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 నాటౌట్) మాత్రం ఆశలు వదులుకోలేదు. తొమ్మిదో వికెట్‌కు లియాన్ (16 నాటౌట్)ను అండగా చేసుకుని ఏకంగా 55 పరుగులు సాధించడంతో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అపూర్వ దృశ్యం చోటు చేసుకుంది. గెలుపు ఖాయమనుకున్న ఇంగ్లండ్‌కు 2 వికెట్ల తేడాతో ఓటమిపాలు కాగా.. 1–0తో సిరీస్‌లో ఆసీస్‌కు ఆధిక్యం దక్కింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌ను అనూహ్యంగా మొదటి రోజే డిక్లేర్ చేయడం ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీసింది. ఖవాజా (66), గ్రీన్ (28) రాణించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 282 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఖవాజా నిలిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 393/8 స్కోరుతో డిక్లేర్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది. అంతకుముందు వర్షం కారణంగా తొలి సెషన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ కారణంగా మ్యాచ్‌కు 67 ఓవర్లే మిగిలాయి.
107/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించగా.. ఖవాజా నిలకడగా ఆడాడు. మరో ఎండ్‌లో బోలాండ్ (20), హెడ్ (16) వికెట్లను త్వరగానే కోల్పోవడంతో టీబ్రేక్ సమయానికి జట్టు 183/5తో నిలిచింది.
ఆఖరి సెషన్లో ఉత్కంఠ: చివరి సెషన్లో ఆసీస్ విజయానికి మరో 98 పరుగుల దూరంలో నిలిచింది. అప్పటికి క్రీజులో ఖవాజా, గ్రీన్ సైతం ఉన్నారు. దీంతో ఆట మరింత ఆసక్తిని రేపింది. కానీ సెషన్ ఆరంభమైన కాసేపటికే గ్రీన్ వికెట్‌ను రాబిన్సన్ తీయడంతో పాటు ఓపిగ్గా క్రీజులో నిలిచిన ఖవాజాను స్టోక్స్ బౌల్డ్ చేశాడు. ఆరో వికెట్‌కు వీరి మధ్య 49 పరుగుల భాగస్వామ్యం జత చేరింది. అటు అలెక్స్ క్యారీ (20) 50 బంతులు ఎదుర్కొన్నా రూట్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఇక ఇదే జోరులో చివరి రెండు వికెట్లను టపటపా పడగొట్టవచ్చని భావించారు. కానీ ఇంగ్లండ్ అంచనాలు తప్పాయి. లియాన్ సహకారంతో కెప్టెన్ కమిన్స్ ఒంటరి పోరాటం చేసి వణుకు పుట్టించాడు. ఎక్కువగా తనే స్ట్రయిక్ తీసుకుంటూ వేగంగా పరుగులు రాబట్టాడు. రూట్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో 14 రన్స్ సాధించి ఆటను మలుపు తిప్పాడు. ఇక 84వ ఓవర్లో లియాన్ ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ వదిలేయగా అదే ఓవర్లో కమిన్స్ ఫోర్ బాదాడు. దీంతో సమీకరణం 13 ఓవర్లలో 30 పరుగులకు చేరింది. ఈ దశలో లియాన్ మరో క్యాచ్‌ను కీపర్ బెయిర్‌స్టో అందుకోలేకపోయాడు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా ఆచితూచి ఆడుతూ ఇద్దరూ లక్ష్యాన్ని కుదిస్తూ వెళ్లారు. అలాగే 90వ ఓవర్లో లియాన్ అద్భుత ఫోర్‌తో ఒత్తిడి తగ్గించాడు. దీంతో సమీకరణం ఏడు ఓవర్లలో ఐదు పరుగులకు మారగా.. కమిన్స్ ఓ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించడంతో ఆసీస్ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.