దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్‌షిప్‌నకు రంగం సిద్ధమైంది. బుధవారం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా తెరలేవనున్న ఈ సాకర్ పోటీల్లో స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ
బెంగుళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) చాంపియన్‌షిప్‌నకు రంగం సిద్ధమైంది. బుధవారం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా తెరలేవనున్న ఈ సాకర్ పోటీల్లో స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత జట్టు హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్ గ్రూప్–ఎలోని కువైట్, నేపాల్ జట్ల (మ. 3.30 గం.) మధ్య జరగనుండగా, ఇదే గ్రూప్ నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభమవనుంది. గ్రూప్–బిలో భూటాన్, లెబనాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు ఉన్నాయి. గతవారం ఇంటర్ కాంటినెంటల్ కప్ నెగ్గి జోష్ మీదున్న భారత్ ఇక్కడా టైటిల్ పట్టేయాలన్న కసితో ఉంది. భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు శాఫ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక, ఈ టోర్నీలో ఛెత్రీ అరుదైన రికార్డును సొంతం చేసుకునే చాన్సుంది. ఆసియా ఫుట్‌బాలర్లలో అత్యధిక గోల్స్ (89) చేసిన మొఖ్తర్ దహరి (మలేసియా) రికార్డుకు ఛెత్రీ 2 గోల్స్ దూరంలో ఉన్నాడు.