తెలంగాణ ఉద్యమ నేతగా, నీళ్ళూ నిధులూ నియామకాలలో తెలంగాణ రాష్ట్రం నష్ట పోయింది అంటూ పలు సమావేశాలలో తన గొంతు వినిపించి, తెలంగాణ ఉద్యమానికి పథ నిర్దేశన చేసిన మాష్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్…
తెలంగాణ ఉద్యమ నేతగా, నీళ్ళూ నిధులూ నియామకాలలో తెలంగాణ రాష్ట్రం నష్ట పోయింది అంటూ పలు సమావేశాలలో తన గొంతు వినిపించి, తెలంగాణ ఉద్యమానికి పథ నిర్దేశన చేసిన మాష్టారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన జయశంకర్ 1995 మలి దశ ఉద్యమానికి తొలి నుంచీ మార్గనిర్దేశకుడిగా, వెన్నెముకగా నిలిచారు. ఆయన మాటలతో తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ఉద్యమ స్ఫూర్తి నెలకొన్నది. అలుపెరుగక ప్రతి పల్లే పట్టణమూ తిరిగి తెలంగాణ నినాదాన్ని ప్రజల మనసుల్లో పాతుకుపోయేట్టు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలలో తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివరించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. ‘మా వనరులు మాకు ఉన్నాయి. మా వనరులపై మాకు పూర్తి అధికారం కావాలి’, అని నొక్కి వక్కాణించారు. ‘యాచక దశ నుంచి శాసన దశకు తెలంగాణ రావాలె, మా తెలంగాణ రాష్ట్రం మాకు కావాలె’ అంటూ విన్నవించారు. ‘స్వయం పాలనలో శ్వాసిస్తాం, ఇతరుల పాలనలో యాచిస్తూ ఉన్నాం. నిజాం నవాబు కాలంలో ఇక్కడ గొలుసు చెరువులే వుండేవి. కావాలని వాటిని నాశనం చేసారు. తెలంగాణ వస్తే ఈ చెరువులను పునరుద్ధరించాలి’ అని పలు సమావేశాల్లో చెప్పినారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్ర ఏర్పాటుకు సరైన నాయకుడిగా కేసీఆర్ను గుర్తించి పార్టీలకు అతీతంగా ముందుకు వెళ్ళాలని కోరిన వ్యక్తి జయశంకర్ మాత్రమే. 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్ష; 2009 డిసెంబర్ 4న శ్రీకాంతచారి ఆత్మాహుతి… తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించాయి. 2009 డిసెంబరు 9న అప్పటి హోం మంత్రి చిదంబరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేసి, తర్వాత ఆంధ్రా పాలకుల ఒత్తిడులకు తలొగ్గి 2009 డిసెంబరు 23న శాసనసభ తీర్మానం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో ఆందోళనలు ప్రారంభం అయినాయి. ఈ విషయంలో జయశంకర్ సర్ తీవ్ర స్థాయిలో మనస్తాపం చెందినారు. ప్రతి పల్లెనూ పట్టణాన్నీ ఉద్యమం వైపు మళ్లించి సామాజిక రాజీనామాలు, ఛలో అసెంబ్లీ ఉద్యమ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. తెలంగాణ మేధావులతో చర్చించి, కవులు, కళాకారులు, రచయితలు, ఉపాధ్యాయ ఉద్యోగులు, జర్నలిస్టులు, వివిధ పార్టీల ప్రతినిధులు, అన్ని కుల సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ముందుకి తీసుకుపోయారు. ‘పుట్టుక నీది, చావు నీది, బ్రతుకు అంతా దేశానిది’ అని చెప్పిన కాళోజీ మాటను నిజం చేసి బతుకంతా తెలంగాణకే అంకితం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణను చూడకుండానే జయశంకర్ సార్ గొంతు కేన్సరుతో బాధపడుతూ 2011 జూన్ 21వ తేదీన కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సర్ సేవలను గుర్తించి ఆయన పేరు మీద జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు జయశంకర్ పేరు పెట్టింది. ఆయన సేవలను స్మరించుకుంటూ, ఆయన కాంస్య విగ్రహాలను జయశంకర్ జిల్లాలోని అన్ని మండలాలలోనూ ఏర్పాటు చేయాలి. ఆయన జీవన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కావాలి