ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఔషధ ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.2.24 లక్షల కోట్లు) చేరుకుంటాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) అంచనా వేస్తోంది…
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఔషధ ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.2.24 లక్షల కోట్లు) చేరుకుంటాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 2,539 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. భారత ఔషఽధాలకు ప్రధాన మార్కెట్లలో ఒకటైన ఆఫ్రికాకు గత ఏడాది ఔషధ ఎగుమతులు 5 శాతం క్షీణించాయి. సీఐఎస్ దేశాలకు 8 శాతం తగ్గాయి. అందువల్ల అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఏడాదిలో అంచనాల కంటే తక్కువగా ఔషధ ఎగుమతుల్లో కేవలం 3.25 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ ఏడాది ఆఫ్రికాకు ఎగుమతులు తిరిగి పుంజుకోగలవని భావిస్తున్నాం. అమెరికాకు ఎగుమతు లు కూడా స్థిరంగా ఉన్నాయ్. ఈ నేపథ్యంలో ఎగుమతులు 2,800 కోట్ల డాలర్లకు చేరుకుంటాయని భావిస్తున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి నెలలో ఎగుమతులు 10.5 శాతం పెరిగాయి. మొదటి రెండు నెలలను తీసుకుంటే 5.1 శాతం వృద్ధి చెందాయని అన్నారు. ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్ (ఐఫెక్స్)ను జూలై 5 నుంచి 7 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడారు.
ఇన్నోవేషన్ ఔషధాలపై దృష్టి పెట్టాలి..
ప్రతి దేశం సొంతగా ఔషధాలను ఉత్పత్తి చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్వయంసమృద్ధిని సాధించాలని భావిస్తున్నాయి. భారత్ భవిష్యత్తులో ‘ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్’గా కొనసాగాలంటే పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. ఇన్నోవేటివ్ ఔషధాలను ఉత్పత్తి చేయాలి. భవిష్యత్తులో ప్రతి దేశం జెనరిక్ ఔషధాలను తయారు చేయనుంది. భారత కంపెనీలు బయో సిమిలర్లు, బయోలాజిక్స్, కాంప్లెక్స్ జెనరిక్స్ వంటి వాటిని తయారు చేయాలని అన్నారు. కెమికల్ పార్కులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత ఔషధ పరిశ్రమ 5,000 కోట్ల డాలర్లకు చేరింది. ఇందులో 50 శాతం వాటా ఎగుమతులదే. దీన్ని నిలబెట్టుకోవడానికి పరిశ్రమ కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉందని ఉదయ్ భాస్కర్ అన్నారు.
ఫార్మాక్సిల్ బాధ్యత ఎగుమతులను ప్రోత్సహించడమేనని, ఇటీవల భారత దగ్గు మందులపై వస్తున్న వ్యతిరేకత మొదలైన వాటికి సంబంధించి కంపెనీలపై రెగ్యులేటరీ సంస్థ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత ఔషధ కంపెనీల తయారీ యూనిట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు ఇంకా కొవిడ్ ముందు స్థాయికి చేరలేదని ఇవి పుంజుకోవాల్సి ఉందని అన్నారు.
ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో..
ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐఫెక్స్‌ను ఫార్మాక్సిల్ నిర్వహిస్తోంది. ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్‌ను 2013 నుంచి నిర్వహిస్తున్నారని, ఈసారి దాదాపు 450 మంది విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారని భాస్కర్ తెలిపారు. 377 ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 10,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. టెక్నాలజీ బదిలీ, వ్యాపార సహకార ఒప్పందాలకు ఐఫ్లెక్స్ వేదిక కానుంది. భారత ఔషధ రంగంపై విదేశీ కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచడానికి ఇది ఒక అవకాశం కాగలదని ఉదయ్ భాస్కర్ అన్నారు.