దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల అప్డేటెడ్ జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.16.3 లక్షల కోట్లుగా ఉంది…
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల అప్డేటెడ్ జాబితాలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.16.3 లక్షల కోట్లుగా ఉంది. రూ.11.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టీసీఎస్ రెండో స్థానంలో నిలవగా.. రూ.9.4 లక్షల కోట్లతో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ మూడో స్థానంలో ఉంది. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన బర్గండీ ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన రిపోర్టులోని మరిన్ని విషయాలు..
- ఈ లిస్ట్ తొలుత 2022 డిసెంబరు 1న విడుదలైంది. 2022 అక్టోబరు నుంచి 2023 ఏప్రిల్ మధ్యకాలంలో మార్కెట్ విలువలో చోటుచేసుకున్న మార్పులతో కూడిన అప్డేటెడ్ రిపోర్టును హురున్ ఇండియా మంగళవారం విడుదల చేసింది.
- గత ఏడాది అక్టోబరు 30 నాటికి లిస్ట్‌లోని 500 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.227 లక్షల కోట్లు గా నమోదు కాగా.. ఆ తర్వాత ఆరు నెలల్లో (ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి) 6.4 శాతం క్షీణించి రూ.212 లక్షల కోట్లకు తగ్గింది. సమీక్షా కాలంలో లిస్ట్‌లోని 500 కంపెనీలు సెన్సెక్స్, నాస్డాక్, ఇతర సూచీల కంటే పేలవ ప్రదర్శన కనబర్చాయి. ఆ 6 నెలల కాలానికి సెన్సెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. నాస్డాక్ 11 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగింది.
- ఈ ఏప్రిల్‌తో గడిచిన ఆరు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 5.1 శాతం (రూ.87,731 కోట్లు) తగ్గగా.. టీసీఎస్ విలువ 0.7 శాతం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 12.9 శాతం వృద్ధి చెందాయి.
- లిస్ట్‌లోని టాప్ టెన్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.71.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో మూడింట ఒక వంతుతో సమానం. జాబితాలోని 500 కంపెనీల మొత్తం విలువలో 34 శాతానికి సమానం.
- అన్‌లిస్టెడ్ కంపెనీల విభాగంలో రూ.1.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో సీరమ్ ఇన్స్టిట్యూట్ నం.1 స్థానం లో నిలవగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (రూ.1,65,300 కోట్లు), బైజూస్ (రూ.69,100 కోట్లు), డ్రీమ్11 (రూ.65,800 కోట్లు), రేజర్‌పే (రూ.61,700 కోట్లు) వరుసగా టాప్ -5 స్థానాల్లో ఉన్నాయి. స్విగ్గీ (రూ.58,400 కోట్లు) ఆరో స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన ఎంఈఐఎల్ (రూ.54,500 కోట్లు) 8వ స్థానంలో నిలిచింది.
- నగరాల వారీగా చూస్తే, అత్యధికంగా 155 కంపెనీలు ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లిస్ట్‌లో 62 బెంగళూరు కంపెనీలు కాగా.. ఢిల్లీవి 40 ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన 29 కంపెనీలకు జాబితాలో చోటు లభించింది.
- రాష్ట్రాల వారీగా చూస్తే, మొత్తం 191 కంపెనీలతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. 30 కంపెనీలతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది.
- కార్పొరేట్ గ్రూప్‌ల వారీగా చూస్తే, టాటా గ్రూప్ నుంచి అత్యధికంగా 15 కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అదానీ గ్రూప్ నుంచి 8 కంపెనీలకు స్థానం లభించింది. ఆదిత్య బిర్లా, మురుగప్పా గ్రూప్‌ల నుంచి 5 చొప్పున సంస్థలకు స్థానం దక్కింది.
అదానీ.. హారతి కర్పూరం
ఈ ఏప్రిల్‌తో ముగిసిన ఆరు నెలల్లో జాబితాలోని 8 అదానీ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 52 శాతం (రూ.10,25,955 కోట్లు) క్షీణించింది. ఏప్రిల్ 30 నాటికి రూ.9.5 లక్షల కోట్లకు పరిమితమైంది. జాబితాలోని 500 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్‌లో 4.5 శాతానికి సమానమిది. అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతోపాటు అక్రమ విధానాల్లో కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని హిండెన్‌బర్గ్ ఈ ఏడాది జనవరి 24న విడుదల చేసిన నివేదికలో ఆరోపించింది. దాం తో అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. గ్రూప్ మార్కెట్ విలువ హార తి కర్పూరంలా కరిగిపోయిం ది. ఈ దెబ్బకు అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ ఈసారి జాబితాలో టాప్ టెన్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సమీక్షా కాలంలో అదానీ టోటల్ గ్యాస్ విలువ 73.8 శాతం (రూ.2,92,511 కోట్లు) క్షీణించి రూ.1.03 లక్షల కోట్లకు జారుకోగా.. అదానీ ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాప్ 69.2 శాతం (రూ.2.59 లక్షల కోట్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ 54.7 శాతం (రూ.1.82 లక్షల కోట్లు) పతనమైంది.