Telangana: పాలుగారే పసిపాపాయిని 5 లక్షలకు బేరం పెట్టారు.. కానీనవమాసాలు మోసి.. కన్న బిడ్డనే అమ్ముకోవాలని చూసింది ఆ తల్లి. ఆర్థిక పరిస్థితుల కారణంగా పాలుగారే పసిబిడ్డను బేరానికి పెట్టింది. విషయంలో తెలియడంతో వెంటనే యాక్షన్‌లోకి దిగారు అధికారులు.ఆడపిల్ల అమ్మకు భారమా? నవమాసాలు మోసింది అమ్ముకునేందుకేనా? ఏదో భయం… ఆడపిల్లను పెంచాలంటే భయం…బడికి పంపాలన్నా భయమే…చివరకు పెళ్ళి చేయాలన్నా మోయలేనంత భారం… బహుశా అందుకేనేమో …కన్నవెంటనే వదిలించుకునే ప్రయత్నం చేసింది బెల్లంపల్లికి చెందిన ఓ కుటుంబం. ఈ దారుణ ఘటన ఆడపిల్లల పట్ల వేళ్లూనుకొన్న వివక్షకు అద్దం పడుతోంది. మంచిర్యాలలో నవజాతి శిశువు అమ్మకం కలకలం రేపింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాలుగారే పసిపాపాయిని 5 లక్షలకు బేరం పెట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.ఈ నెల 13న మంచిర్యాల ఎంసిహెచ్ లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది బెల్లంపల్లిలోని గంగరాంనగర్కు చెందిన రోజా. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శిశువును అమ్మకానికి పెట్టినట్టు చెప్పింది తల్లి. తల్లికి రూ.4 లక్షలు, బ్రోకర్ కు లక్ష ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. మంచిర్యాల ఎంసీహెచ్‌లో జరుగుతోన్న దారుణాన్ని అడ్డుకున్నారు ఐసిడిఎస్ అధికారులు. శిశువును రక్షించి.. ఆదిలాబాద్ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు అధికారులు.
ఆడపిల్ల ఎప్పటికీ భారం కాదు. అందరూ ఆడపిల్లల్ని వద్దనుకుంటే ఈ సృష్టి అనేదే అంతం అవుతుంది. బరువు, బాధ్యతలు పంచుకోవడంలో.. మమత పంచడంలో ఆడపిల్లలు ఎప్పుడూ ముందుంటారని గుర్తుపెట్టుకోండి.