Tana 2023: ఫిలడెల్పియాలో తానా 23వ మహా సభలు.. నటుడు రాజేంద్రప్రసాద్‌కు ఆహ్వానంఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించినట్లు ..ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటులుగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్ నటుడిగానే కాకుండా, అభిరుచిగల నిర్మాతగా కూడా వ్యవహరించారు. తన మాటలతో, హావభావాలతో ఆకట్టుకునే రాజేంద్రప్రసాద్ తానా మహాసభల్లో కూడా అందరినీ అలరించనున్నారు. ఎన్నో కార్యక్రమాలతో సంగీత విభావరులతో అలరించే తానా మహాసభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. కాగా తానా 23వ మహాసభ సమావేశాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్సహించి అవార్డులతో ఘనంగా సత్కరించనున్నారు. విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ‘తానా అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్’ పేరిట పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరించనున్నారు.కాగా మొత్తం మూడు రోజులు జరిగే ఈ వేడుకల్లో అమెరికా, కెనడా , ఉభయ తెలుగు రాష్టాలలో వున్న విశిష్ఠ అతిథులు హాజరుకానున్నారు. తెలుగు ఆడపడుచుల ఆట పాటలు, ఆత్మీయుల పలకరింపులు, అతిరథ మహారథులు, కవులు, కళాకారులతో వీనుల విందైన సంగీతం, ఆహ్లాదకరమైన కార్యక్రమాలు.. పండుగ వాతావరణంలో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, అంగ రంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి.ఇక వేడుకల్లో చివర రోజైన జూలై 9వ తేదీ ఉదయం 7 గంటలకు ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ప్రపంచ శాంతి, మానవ జాతికి విజయం కోసం TTD అర్చకులు నిర్వహించనున్నారు.