జూన్ 2వ తేదీన బాలేశ్వర్‌లోని బహానగా రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే బహానగా వాసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు.
Odisha Train Tragedy: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని వందల మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర ప్రమాదం బాలేశ్వర్ ప్రజలకు ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ ప్రమాదానికి సంబంధించిన వార్తలు వింటేనే వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బహానగా ప్రభుత్వ పాఠశాలలో భద్రపర్చారు. వేసవి సెలవులు కావడం, పాఠశాలలో విద్యార్థులు లేకపోవడం, రైలు ప్రమాద స్థలికి ఆ పాఠశాల దగ్గరగా ఉండడంతో అధికారులు దానినే తాత్కాలిక మార్చురీగా మార్చేశారు. అనంతరం మృతదేహాలను ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత స్కూల్‌ను శుభ్రం చేశారు. ప్రస్తుతం అక్కడ మృతదేహాలు లేకపోయినా ఆ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ పాఠశాల భవనాన్ని కూల్చేశారు.
సాయం చేసింది ఆ గ్రామస్తులే..
జూన్ 2వ తేదీన బాలేశ్వర్‌లోని బహానగా రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే బహానగా వాసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ఘటనలో 288 మంది దుర్మరణం చెందగా.. ఈ మృతదేహాలను తొలుత బహానగా హైస్కూల్‌కు తరలించారు. అనేక మృతదేహాలను ఒకే చోట చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో ధైర్యంగా సేవలు అందించిన గ్రామస్తులు ఇప్పుడు ఆ ప్రదేశానికి వచ్చేందుకు జంకుతున్నారు.
జూన్ 16న పాఠశాలల పునఃప్రారంభం
వేసవి సెలవుల అనంతరం జూన్ 16న ఒడిశాలో పాఠశాలలను పునఃప్రారంభించనున్నారు. అయితే, పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు ధైర్యం చేయడంలేదు. తల్లిదండ్రులు చిన్నారులను పంపించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలాస్వేన్ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల భవనం కూడా దెబ్బతిన్నది. దీంతో ఈ స్కూల్ భవనాన్ని కూల్చాలని పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేత..
ఈ నేపథ్యంలోనే బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ శిందే గురువారం స్కూల్‌కు వెళ్లి పరిశీలించారు. అనంతరం కూల్చివేతకు అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఈ భవనాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ ప్రదేశంలోనే మరో కొత్త భవనాన్ని నిర్మిస్తామని, అప్పుడు విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా వస్తారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. కొత్త భవనం నిర్మించి పూజలు నిర్వహించి పవిత్రం చేసిన తర్వాత స్కూలును పునః ప్రారంభిస్తామని ఆ పాఠశాల మేనేజింగ్ కమిటీ సభ్యుడు రాజారామ్ మోహాపాత్ర తెలిపారు.