ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఉన్న బీజేపీ ఈ తలనొప్పులను నివారించుకునేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్‌ను అమిత్ షా ఢిల్లీ పిలిపించుకున్నారు.
Etela Rajender : మొన్నటి దాకా బీఆర్ఎస్ కు బీజేపీ కి టగ్ ఆఫ్ వార్ నడిచేది. ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపడంలో బీజేపీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది కాదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నుంచి టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ దాకా ప్రతీ విషయంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఊపిరి తీసుకోకుండా చేసింది. దీనికి తోడు ప్రతీ సభలో, ప్రెస్ మీట్లో కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా బీజేపీని ఏకిపారేశారు. ఫలితంగా కాంగ్రెస్‌కు బదులుగా బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదిగింది. గత నెల క్రితం వరకు ఇదే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో అప్పుడే బీజేపీలో లొల్లి ప్రారంభమైంది. అక్కడ బీజేపీ ఓడిపోవడంతో ఇక్కడ లుకలుకలు మొదలయ్యాయి. అవి తారస్థాయికి చేరాయి. అంతే కాదు బీజేపీ ముదిగొండ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని, పార్టీలో ఓ వర్గం వారు బండి సంజయ్ నాయకత్వం మీద ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఎవరూ ఖండించకపోవడం, విజయశాంతి వంటి వరుస ట్వీట్లు చేయడంతో బీజేపీలో ఏదో జరుగుతోంది అనే సంకేతాలు కన్పించాయి.
అసమ్మతి నేతలతో ఈటల భేటీ
ఈ వ్యవహారం సాగుతుండగానే బీజేపీలోని అసమ్మతి నేతలతో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. పలు విషయాల మీద మాట్లాడారు. అంతకుముందు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును ఈటల రాజేందర్, మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిశారు. బీజేపీలోకి ఆహ్వానించారు. కానీ వారు ఏ సమాధానం చెప్పలేదు. ఇది జరుగుతుండగానే తనకు దీనికి గురించి సమాచార లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం విశేషం. ఇది జరిగిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం, తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందని ఊహాగానాలు విన్పించాయి. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నాయకుల వ్యవహార శైలి ఉండటంతో కార్యకర్తల్లో ఒకింత నైరాశ్యం అలుముకుంది.
పొంగులేటి, జూపల్లి రాం రాం!
అంతకుముందే ఈటల వీరితో చర్చలు జరిపిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు. ఇది జరిగిన తర్వాత కొద్ది రోజులకే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో పొంగులేటి, జూపల్లి మనసు మార్చుకున్నారు. వారు కాంగ్రెస్‌లో వెళ్లేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. వారు కాంగ్రెస్‌లోకి వెళ్లడం బీఆర్ఎస్ కంటే బీజేపీకే పెద్ద లాస్. ఎందుకంటే వారు చేరితే బీజేపీ ఎంతో కొంత బలాన్ని ప్రోది చేసుకునేది. కానీ ఆ దిశగా బీజేపీ వారికి భరోసా ఇవ్వడంలో విఫలమైంది. ఇక ఈటల రాజేందర్ కూడా నారాజ్‌గా ఉండటంతో అధిష్ఠానం ఆయనను శుక్రవారం ఢిల్లీ పిలిపించింది. తనను రాష్ట్ర అధ్యక్షుడు లేదా ముఖ్యమంత్రిగా ప్రకటించాలని ఒక ప్రతిపాదన పంపారు. అయితే అంతకుముందే కేంద్ర మంత్రిగా ప్రకటిస్తామని అధిష్ఠానం ఆఫర్ ఇచ్చింది. దీనికి సంజయ్ నో చెప్పాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సంజయ్‌ని పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినా.. అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.
ఈటలకు ఆఫర్
ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఉన్న బీజేపీ ఈ తలనొప్పులను నివారించుకునేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్‌ను అమిత్ షా ఢిల్లీ పిలిపించుకున్నారు. ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాజేందర్‌కు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో గతంలో నరేంద్రమోదీకి కూడా ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని, గోవా తీర్మానం అనంతరం ఆయన ప్రధానమంత్రి అయిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. అయితే అమిత్ షా హామీ వెనుక అంతరర్థాన్ని గ్రహించిన ఈటల నవ్వు ముఖంతో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని ఈటలకు అమిత్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. పైగా ఈనెలలో ఖమ్మంలో నిర్వహించే సభ ద్వారా ఎన్నికల ప్రచారం ముందుగానే మొదలు పెట్టేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. అయితే ఈసభ ద్వారా పొంగులేటి మనసు మార్చే ప్రయత్నం అమిత్ షా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.