తనకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగ్గట్టుగా పెన్షన్ రావడంలేదని షా చెప్పడంతో కలాం శ్రద్ధగా విన్నాడు. ఢిల్లీకి వెళ్లినప్పుడు వెంటనే కలాం చేసిన పని.. రక్షణ అధికారులతో మాట్లాడాడు. షా కు సంబంధించిన ఫైలు వెంటనే తెప్పించుకున్నాడు. ఫీల్డ్ మార్షల్ ఆధారంగా షా కు పెన్షన్ మంజూరు చేయించాడు.
Abdul Kalam : కొన్ని కథలు వింటుంటే కన్నీళ్లు వచ్చేస్తాయి. కొన్ని గాథలను చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. అలాంటివే భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. చుట్టూ ఉన్న ప్రపంచంలో నిండి ఉన్న నెగిటివిటీ ని దూరం చేసి పాజిటివిటీని పెంచుతాయి. అలాంటిదే ఈ కథ.. కాదు కాదు భారత రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఉదాత్తతను చాటి చెప్పే వాస్తవ గాథ. చీఫ్ మార్షల్ మానిక్ షా దేశభక్తిని చాటే గాథ. అబ్దుల్ కలాం గురించి మరీ ముఖ్యంగా చదవాల్సిన గాథ.
…
ప్రొటోకాల్ పక్కన పెట్టారు
…
భారత రాష్ట్రపతి పదవి అంటేనే అనేక ప్రోటోకాల్ చట్రాల మధ్య ఇమిడి ఉండేది. ఉంటుంది. ముందస్తుగా ఖరారు కాకుండా ఏ పర్యటనకూ రాష్ట్రపతి వెళ్లేందుకు అవకాశం ఉండదు. అందుకు సెక్యూరిటీ సంస్థలు ఒప్పుకోవు. కానీ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వీటి అన్నింటికీ అతీతంగా వ్యవహరించేవారు. తన కార్యాలయంలోకి చిన్నారులను, భావి భారత విద్యార్థులను, యువ శాస్త్రవేత్తలను ఆహ్వానించేవారు. వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడేవారు. ముఖ్యంగా చిన్నారులతో కబుర్లు చెప్పేవారు. వారికి విలువైన పుస్తకాలను బహుమతులుగా అందించేవారు. చిన్నారులు విసిరే చలోక్తులకు మంత్రముగ్ధులు అయ్యేవారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నిత్యం సందర్శకులతో రాష్ట్రపతి భవన్ కళకళలాడుతూ ఉండేది. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ ప్రాంతంలోని కూనురుకు ఏదో పర్యటన నిమిత్తం వెళ్లారు. అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్ లో ఫీల్డ్ చీఫ్ మార్షల్ మానిక్ షా చికిత్స పొందుతున్నాడని తెలుసుకున్నారు. అప్పటికి ఆయన షెడ్యూల్ లో ఈ పర్యటన లేదు. సెక్యూరిటీ అధికారులు కుదరదు అన్నారు. కానీ అబ్దుల్ కలాం లక్ష్య పెట్టలేదు. వెంటనే తన కాన్వాయ్ ని మిలటరీ హాస్పిటల్ వైపు వెళ్లాలని సూచించాడు. తీరా హాస్పిటల్ కి వెళ్ళాక బెడ్ పై పడుకుని ఉన్న మానిక్ షా ను చూశాడు. ఆయన బెడ్ పక్కనే కూర్చున్నాడు. చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. సెక్యూరిటీ అధికారులు గుర్తు చేయడంతో ఢిల్లీ వెళ్లేందుకు అబ్దుల్ కలాం లేచారు. ” ఇక్కడ అంతా సౌకర్యంగానే ఉందా? నేను మీకోసం ఏమైనా చేయాలా” అని మానిక్ షా ను ఉద్దేశించి కలాం అడిగారు. దానికి “ఒకటి ఉంది సార్” అని షా అనగానే.. “ఏమిటది” కలాం మోములో ఒకింత ఆశ్చర్యం. “సాక్షాత్తూ దేశ ప్రథమ పౌరుడు నా ముందుకు వస్తే లేచి నిలబడి సెల్యూట్ చేసే స్థితిలో లేనందుకు చింతిస్తున్నాన”ని చెప్పడంతో కలాం కన్నీటి పర్యంతం అయ్యాడు. షా మోము మీద ఉన్న కన్నీళ్ళను తుడుచుకుంటూ, బుగ్గలు నిమురుతూ వెళ్ళిపోయాడు.
ఢిల్లీ వెళ్ళగానే కలాం ఆ పని చేశాడు
…
ఇద్దరి మధ్య మాటల సంభాషణ జరుగుతున్నప్పుడు తనకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగ్గట్టుగా పెన్షన్ రావడంలేదని షా చెప్పడంతో కలాం శ్రద్ధగా విన్నాడు. ఢిల్లీకి వెళ్లినప్పుడు వెంటనే కలాం చేసిన పని.. రక్షణ అధికారులతో మాట్లాడాడు. షా కు సంబంధించిన ఫైలు వెంటనే తెప్పించుకున్నాడు. ఫీల్డ్ మార్షల్ ఆధారంగా షా కు పెన్షన్ మంజూరు చేయించాడు. డిఫెన్స్ సెక్రెటరీ నుంచి ₹1.25 కోట్ల చెక్కును కొరియర్ ద్వారా వారం రోజుల్లో పంపించాడు. ఇక్కడే తన విధి నిర్వహణను కలాం తుచ తప్పకుండా నిర్వహించాడు. అసలు ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ డబ్బు మొత్తాన్ని ఆర్మీకి మానిక్ షా విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు ఎవరికి సెల్యూట్ చేయాలి? గత ఏడాది అగ్నిపథ్ నిరసనలతో యువత క్షణిక భావోద్వేగాలకు గురయిన నేపథ్యంలో ఇలాంటి దేశోద్ధాత్త క్యారెక్టర్ల గురించి, వారి కథల గురించి తెలుసుకోవాలి. దేశభక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దేశం కోసం ఏం చేయాలో, కులం, మతం, వర్గం, వర్ణాలుగా విడిపోయి కొట్టుకు చస్తున్న యువత తెలుసుకోవాలి.