Kakinada Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఒకేసారి..! ఊరుఊరంతా శోకసంద్రంలో
ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట, ఒకే వాహనం. ఈ ప్రాణ స్నేహితుల్ని చూసి విధికి కూడా కన్నుకుట్టిందేమో.. ముగ్గురినీ ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఫ్రెండ్ వివాహానికని బైకుపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొని అశువులు బాశారు. కాకినాడ జిల్లా..
కాకినాడ: ఎక్కడికి వెళ్లినా ముగ్గురిదీ ఒకే మాట, ఒకే వాహనం. ఈ ప్రాణ స్నేహితుల్ని చూసి విధికి కూడా కన్నుకుట్టిందేమో.. ముగ్గురినీ ఒకేసారి కాటేసింది. దీంతో ఒకే రోజు మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. ఫ్రెండ్ వివాహానికని బైకుపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీ కొని అశువులు బాశారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం జి ముసలయ్యపేట వద్ద బుధవారం రాత్రి (జూన్ 7) ఈ ప్రమాదం జరిగింది. తొండంగి ఎస్సై రవికుమార్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
కాకినాడ జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన పోలవరపు కిరణ్ (23), పసుపులేటి దుర్గా శివప్రసాద్ (20), కాకర వీరబాబు(21) స్నేహితులు. వీరు ముగ్గురూ బుధవారం రాత్రి బైకుపై స్వగ్రామం నుంచి బీచ్‌రోడ్డు మీదుగా అన్నవరంలో జరిగే స్నేహితుని వివాహానికి బయలుదేరారు. జి ముసలయ్యపేట వద్దకు చేరుకోగానే వీరు ప్రయానిస్తున్న బైకు ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్, వీరబాబు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రగాయాల పాలైన శివప్రసాద్‌ను స్ధానికులు తుని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆధిక వేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాలకు అండగా ఉన్న ఈ ముగ్గురి ప్రాణ స్నేహితుల మృతి ఆ కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. వీరి శోకం ఊరంతటినీ కంటతడి పెట్టించింది.