Ambati Rayudu: వైసీపీలోకి అంబటి రాయుడు..! సీఎం జగన్‌తో ముగిసిన భేటీ..
Shaik Madar Saheb | Updated on: Jun 08, 2023 | 4:40 PM
Ambati Rayudu Meets CM YS Jagan: రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ambati Rayudu Meets CM YS Jagan: రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు తాజాగా మరోసారి సీఎంతో భేటీ అవ్వడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాయుడు.. జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఇద్దరి మధ్య దాదాపు అరగంటపాటు చర్చలు జరిగాయి. జగన్ తో భేటీ అనంతరం అంబటి రాయుడు అక్కడి నుంచి ఇంటికి బయలు దేరారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు వైసీపీలో చేరి.. అక్కడి నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ను వెంటవెంటనే కలుస్తుండటం ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు.. IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చివరి మ్యాచ్ ఆడారు. త్వరలోనే తన సెకండ్ సైడ్ చూస్తారని మే 30న అంబటి రాయుడు ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను పదే పదే కలుస్తుండటంతో రాజకీయాల్లోకి ఎంట్రీయే ఆ రెండో సైడ్ అని గట్టిగా అనిపిస్తోంది.
అయితే, గత కొంతకాలంగా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని అంబటి రాయుడు వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన అంబటి తిరుపతి రాయుడు జనసేన వైపు వెళ్తారని ప్రచారం జరిగింది. కాని, ఈ మధ్య కాలంలో ఆయన వైసీపీ వైపు దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.
గత నెల శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు సీఎం శంకుస్థాపన చేసిన వీడియోను రీట్వీట్ చేసినప్పటి నుంచి అంబటి YCPలో చేరడం తథ్యమనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అందరికీ జగన్‌పై నమ్మకం విశ్వాసం ఉన్నాయని అంబటి ట్వీట్లో కామెంట్ చేశారు. ఆ ట్వీట్‌పై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.